విజయ్ సాయిరెడ్డి హింట్ ఇచ్చేసారా ?

వి విజయసాయిరెడ్డి. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారు. రాజకీయ వ్యవసాయం దశాబ్దం పైగా చేసి ఉన్నారు.;

Update: 2026-03-31 02:48 GMT

వి విజయసాయిరెడ్డి. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారు. రాజకీయ వ్యవసాయం దశాబ్దం పైగా చేసి ఉన్నారు. వైసీపీలో నంబర్ టూ హోదాను అనుభవించారు. జగన్ తరువాత అంతగా వెలిగారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను పోషించారు. జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో ఎంతో సాన్నిహిత్యం నెరిపి ఏకంగా ప్రధాని మోడీ చేత పేరు పెట్టి పిలిపించుకునేటంత చనువు ఆయన సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో వైసీపీ అంటే విజయసాయిరెడ్డి అన్నట్లుగా ఇమేజ్ ని బిల్డప్ చేసుకున్నారు. అలాంటి విజయసాయిరెడ్డి సడెన్ గా రాజకీయాల నుంచి విరామం ప్రకటించారు. నాకొద్దీ రాజ్యసభ అన్నారు. వైసీపీకి గుడ్ బై కొట్టారు.

రాజకీయమే అంటూ :

గత ఏడాది జనవరి 25న ఆయన రాజకీయాల నుంచి పరిత్యాగం చేసి వెనక్కి వెళ్ళారు.అయితే ఆయన ఈ ఏడాది మొదట్లోనే మరో మాట కూడా చెప్పారు. తాను రాజకీయాల్లో కొనసాగుతాను అని జస్ట్ గ్యాప్ మాత్రమే ఇచ్చాను అని చెప్పారు. అంతే కాదు తాను ఏ పార్టీలో చేరేది కూడా చెబుతాను అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీల పేర్లు చెప్పారు. కానీ తాను చేరేది అయితే చెప్పలేదు. ఇదిలా ఉంటే జూన్ లో తన రాజకీయ పునరాగమనం ఉంటుంది అని విజయసాయిరెడ్డి చెప్పారు. దానికి రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో విజయసాయిరెడ్డి చేరేది ఏ పార్టీలో అన్న చర్చ మొదలైంది.

కూటమి సర్కార్ మీదనే :

అయితే గత పదిహేను నెలలుగా విజయసాయిరెడ్డి రాజకీయ ప్రకటనలు పెద్దగా చేయడం లేదు, అంతే కాదు కూటమి మీద కూడా ఆయన ఏమీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు, కానీ అమరావతి రాజధాని మీద అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మీద ఆయన తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అమరావతి రాజధాని వరకూ ఓకే కానీ భూములు ఇచ్చిన రైతులకు ఒరిగింది ఏముంది అని సూటిగా కూటమి ప్రభుత్వం పెద్దలను ప్రశ్నించారు. అంతే కాదు ఇప్పటికి 11 ఏళ్ళ క్రితం భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా నివాసం కోసం ప్లాట్లు ఇచ్చారా వారు ఇళ్ళు కట్టుకున్నారా అని ప్రశ్నించారు. అలాగే కమర్షియల్ ప్లాట్లలో వారు వ్యాపారాలు ఏమైనా చేశారా అని కూడా నిలదీశారు. రైతుల బాగు చూడాలని ఒక సాటి రైతుగా కోరుతున్నాను అని ట్వీట్ ని విజయసాయిరెడ్డి ముగించారు.

మూడు పార్టీలతోనూ :

కూటమి అంటే మూడు పార్టీలు ఉన్నాయి. మరి కూటమి మీద విజయసాయిరెడ్డి నేరుగా చేసిన ఆ ట్వీట్ తో మరోసారి రాజకీయ రచ్చ రేగుతోంది. ఆయన కూటమి మీద విమర్శలు చేయడంతో ఆ వైపు వెళ్ళే అవకాశాలు లేవా అని కూడా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో అమరావతి రాజధాని విషయంలో వైసీపీ అవినీతి అక్రమాలు అంటోంది. రైతుల ప్రయోజనాలు దెబ్బ తీశారు అంటోంది. విజయసాయిరెడ్డి అదే ట్యూన్ తో వాయిస్ వినిపించడంతో ఆయన హింట్ ఏమైనా ఇచ్చారా అని చర్చ నడుస్తోంది.

గ్రీన్ సిగ్నల్ వచ్చిందా :

వైసీపీలో ఈ మధ్య భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ప్రస్తుతం కోటరీగా చెప్పబడుతున్న వారిని మెల్లగా సైడ్ చేస్తున్నారు. అదే సమయంలో సమిష్టి నాయకత్వానికి పెద్ద పీట వేస్తున్నారు. అందరికీ సమాన ప్రాధాన్యత అని చెప్పడమే వైసీపీ ఉద్దేశ్యం అని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ మాజీలను తీసుకోవాలని పార్టీ చూస్తోంది అని అంటున్నారు ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని అంటున్నారు. ఆయన కనుక చేరితే పూర్వం మాదిరిగా గౌరవం ఇస్తారని కూడా పార్టీలో అంటున్నారు. మొత్తానికి తొందరలోనే వ్యవసాయానికి స్వస్తి చెప్పి రాజకీయ వ్యవసాయానికి విజయసాయిరెడ్డి రెడీ అవుతున్నారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News