ఏపీకి అదే పెద్ద జబ్బు... కూటమి అలెర్ట్
ఏపీకి అదే పెద్ద జబ్బు అని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి నుంచే దానికి తగిన మందు వేయకపోతే మాత్రం ఇది పెరిగి పెద్దదై ఏపీలో సంతాన సౌభాగ్యాన్ని చిదిమి వేస్తుందని ఆందోళన చెందుతోంది.;
ఏపీకి అదే పెద్ద జబ్బు అని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి నుంచే దానికి తగిన మందు వేయకపోతే మాత్రం ఇది పెరిగి పెద్దదై ఏపీలో సంతాన సౌభాగ్యాన్ని చిదిమి వేస్తుందని ఆందోళన చెందుతోంది. ఏపీలో చూస్తే సంతానోత్పత్తి క్షీణత అధికంగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. తగిన చర్యలతో ముందుకు రాకపోతె కనుక అదే విధంగా కీలక చర్యలు తీసుకోకుంటే మాత్రం తీవ్రమైన అనర్ధాలను ఏపీ చూడాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు.
జనాభా స్థిరీకరణ కోసం :
ఏపీలో అర్జంటుగా జనాభా స్థిరీకరణ కోసం భారీ యాక్షన్ ప్లాన్ ని కూటమి ప్రభుత్వం చేపడుతోంది. ఈ మేరకు కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిని మీద విస్తృత చర్చ కోసం ప్రజల ముందుకు జనాభా స్ధిరీకరణ విధాన పత్రాన్ని తీసుకుని రాబోతోంది. ఏపీలో దారుణంగా సంతానోత్పత్తి రేటు ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చూస్తే రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు కేవలం 1.50గా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2035 నాటికి 2.10 రేటుగా ఉంటనే జనాభా స్థిరీకరణ లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రెండింతలు కానున్న వృద్ధులు :
ఏపీలో రానున్న కాలంలో రెండింతలు కానున్న వృద్ధుల సంఖ్య అని నివేదికలు చెబుతున్నాయి. అంతే కాదు సంతాన హీనతతో భారీగా ప్రగతి తగ్గనుంది అలాగే అవసరమైన శ్రామిక శక్తి కొరత ఏర్పడబోతోంది. దాంతో అనుకూల పరిస్థితుల కల్పనతో స్వచ్ఛందంగా అధిక మంది పిల్లలు కనే దిశగా బాటలు వేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఈ విధంగా ఏపీలో జనాభా పెరుగుదల కోసం ప్రభుత్వం రూపొందించిన నూతన విధానం గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వివరించారు.
ప్రజలకు హెచ్చరిక :
ఆందోళనకర రీతిలో రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు క్షీణిస్తోందని మంత్రి అంటున్నారు. ఈ మేరకు మంత్రి విడుదల చేసిన ఒక వివరణాత్మక ప్రకటనలో రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు అంటే తన జీవితకాలంలో మహిళలు జన్మనిచ్చే పిల్లల సంఖ్య క్రమేణా అతి తక్కువగా 1.50కు పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా స్థిరీకరణకు సంతానోత్పత్తి రేటు 2.10 అవసరం కాగా దశాబ్దాలుగా అనుసరిస్తున్న జనాభా నియంత్రణ విధానంతో ఈ రేటు ఈనాటికి 1.50 శాతానికి పడిపోయిందని చెప్పుకొచ్చారు. ఇకనైనా దిద్దుబాటు చర్యల్ని చేపట్టకుంటే ప్రజలతో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తీవ్ర విఘాతం ఏర్పడనుందని మంత్రి హెచ్చరించారు.
యువశక్తి కనుమరుగు :
ప్రజల తీరు మారకుంటే అధిక యువశక్తితో కూడిన జనాభాతో లభించే ప్రయోజనం 2040 నాటికి కనుమరుగవుతుందని చెప్పారు అంతే కాకుండా అధిక శాతం వృద్ధులతో కూడిన జనాభా రాష్ట్రానికి భారంగా మారనుందని మంత్రి స్పష్టం చేశారు. సంతానోత్పత్తి క్షీణతతో ప్రగతికి ఊతమిచ్చే కార్మిక శక్తి తగ్గిపోయి భారీగా పెరగనున్న వయో వృద్ధుల భారాన్ని రాష్ట్రం మోయాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో 2035 నాటికి రాష్ట్రంలో జనాభా స్థిరీకరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన ప్రణాళికను రూపొందించిందని చెప్పారు.
జనాభా నియంత్రణకు స్వస్తి :
జనాభా నియంత్రణ విధానానికి స్వస్తి పలికి జనాభా సంరక్షణతో కూడిన సానుకూల వాతావరణంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేలా కుటుంబాలు స్వచ్ఛంద నిర్ణయాలు తీసుకునే అనుకూల పరిస్థితుల్ని కల్పించడం నూతన విధానం లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. తల్లికి పూర్తి ఆరోగ్య భద్రత కల్పించి ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనివ్వడం, వారి పోషణకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని అన్నారు.
ఇప్పటి వరకు అమలు చేసిన జనాభా నియంత్రణ విధానంతో రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు 2011-15 కాలంలో ఉన్న 7.10 శాతం నుండి నేటికి 1.70 శాతానికి తగ్గిందని, ఇదే మార్గంలో 2035 నాటికి మరింతగా తగ్గి 0.30 శాతానికి పడిపోతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర జనాభా వార్ధక్యం వైపు :
ఇపుడున్న పరిస్థితులు కొనసాగితే రాష్ట్ర జనాభా వార్ధక్యం వైపు వేగంగా పయనించడం ఖాయమని మంత్రి చెబుతున్నారు. ప్రస్తుత రాష్ట్ర జనాభా మధ్యస్త వయసు 32.50 సంవత్సరాలుండగా జాతీయ స్థాయిలో చూస్తే ఇది నాలుగున్నరేళ్ల తక్కువగా కేవలం 28 సంవత్సరాలు మాత్రమే ఉందని గుర్తు చేశారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి చెబుతున్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు రానున్న 10 సంవత్సరాలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. 2035 నాటికి 2.10 సంతానోత్పత్తి రేటును సాధించి జనాభా స్థిరీకరణకు బాటలు వేయాల్సిన అవసరముందని మంత్రి చెబుతున్నారు. ఈ దిశగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి సహకరించాలని మంత్రి కోరుతున్నారు. మరి ఈ విధాన పత్రం మీద ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.