అప్పటివరకే నితీష్ సీఎం ?
బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ఎన్నాళ్ళు కొనసాగుతారు అన్న చర్చకు తెర లేస్తోంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవికి సోమవారం రాజీనామా చేశారు.;
బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ఎన్నాళ్ళు కొనసాగుతారు అన్న చర్చకు తెర లేస్తోంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవికి సోమవారం రాజీనామా చేశారు. మార్చి 16న ఆయన రాజ్యసభకు నెగ్గారు. ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు పదవులలో ఉండరాదు. ఒక పదవికి నెగ్గిన 14 రోజులలోగా ఒక పదవిని మాత్రమే ఉంచుకోవాలని నిబంధనలు సూచిస్తున్నాయి. దాంతో ఈ నిబంధనల గడువుకు మార్చి 30 చివరి రోజు కావడంతో నితీష్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బీహార్ రాష్ట్రంలోని ఏ సభలోనూ సభ్యుడు కారు, అయితే రాజ్యాంగం ప్రకారం ఆ విధంగా ఆరు నెలల వరకూ పాలించవచ్చు. దాంతో నితీష్ కుమార్ సీఎం పదవికి ప్రస్తుతానికి ఢోకా లేదు మరి ఆయన ఎపుడు రాజీనామా చేస్తారు అన్న చర్చ బీహార్ వ్యాప్తంగానే కాదు జాతీయ స్థాయిలోనూ జరుగుతోంది.
కేబినెట్ లోకి నేరుగా :
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ ని నేరుగా కేంద్ర కేబినెట్ లోకి తెసుకోవాలని బీజేపీ అధినాయ్కాత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ గా నితీష్ కుమార్ ఉన్నారు. ప్రధాని మోడీకి సమకాలీనుడు సమ ఉజ్జీగా ఉన్న నితీష్ ని కేంద్రంలో కీలక స్థానంలో ఉంచాలని ఆ విధంగా బీహార్ లో ప్రజలకు ఆరాధ్య నేతగా ఉన్న ఆయన ఇమేజ్ ని బీజేపీ రాజకీయ విస్తరణకు వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే కొన్నాళ్ళ పాటు ఆయన సీఎం గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
విస్తరణ వరకూ ఆయనే :
ఇక కేంద్ర కేబినెట్ విస్తరణ అన్నది తొందరలో జరుగుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలు మే 4న వస్తాయి. ఆ తరువాత ఏ క్షణంలోనైనా కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండొచ్చు అని అంటున్నారు. మరి అప్పటిదాకా నితీష్ ని ముఖ్యమంత్రి పీఠం మీదనే కొనసాగనిస్తారా అంటే రాజకీయ విశ్లేషణలు చూస్తే అలాగే ఉన్నాయి. ఎందుకంటే దేశంలో ప్రముఖ నేత అయిన నితీష్ ని ఈ దశలో తప్పిస్తే అది ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో తప్పుడు సంకేతాలు ఇస్తుందని కూడా బీజేపీ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
కొత్త సీఎం గా ఎవరు :
ఇక బీజేపీలో చూసినా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న చర్చ కూడా సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి రేసులో ముందున్నారు. ఆయన పేరునే 2025 చివరిలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా అంతా ప్రస్తావించేవారు. దాంతో ఆయనే కొత్త సీఎం అని గట్టిగా వినిపిస్తోంది. అదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నిత్యానందరాయ్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన్ని రాష్ట్రానికి పంపిస్తారు అని అంటున్నారు. ఈ ఇద్దరి పేర్లతో పాటు మరి కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీజేపీ ఎపుడూ అనూహ్యమైన అభ్యర్థి ని ఎంపిక చేస్తుంది కాబట్టి ఆ చర్చ అలాగే సాగుతోందిపుడు.
రాజకీయ ముఖ చిత్రం :
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ రాజీనామా చేసి కేంద్రానికి వెళ్ళడం అంటే అది బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందని అంటున్నారు. ఇది గణనీయమైన మార్పులకు దారి తీస్తుందని చెబుతున్నారు. అయితే నితీష్ మాత్రం తన ఆకాంక్షలకు అనుగుణంగానే తాను రాజ్యసభకు వెళ్తున్నానని చెబుతున్నారు. అంతే కాదు బీహార్ ప్రజలతో తన బంధం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుందని ఆయన హామీ ఇస్తున్నారు. ఇక బీహార్ లో బాధ్యతలు స్వీకరించే కొత్త ప్రభుత్వానికి పూర్తి సహకారంతో పాటు తనదైన మార్గదర్శకత్వం అందిస్తానని కూడా నితీష్ కుమార్ భరోసా ఇచ్చారు. ఏది ఏమైనా నితీష్ కుమార్ నిర్ణయంతో బీహార్‌లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ సొంతంగా ముఖ్యమంత్రిని నియమించుకునేందుకు మార్గం సుగమమైంది. ఆ పార్టీ చిరకాల కోరిక సైతం నెరవేరుతోంది.