కరోనా వ్యాక్సినేషన్: ఢిల్లీలో 50మందికి స్వల్ప అస్వస్థత.. ఒకరు సీరియస్

Update: 2021-01-17 05:30 GMT
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం నిన్న  దేశంలో గ్రాండ్ గా ప్రారంభమైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే స్వల్ప రియాక్షన్స్ కనిపించాయి.

తాజాగా ఢిల్లీలో వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 51 మంది హెల్త్ కేర్ సిబ్బంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చరాక్ ఆస్పత్రి, సౌత్ ఢిల్లీ, తూర్పు ఢిల్లీల్లో టీకా తీసుకున్నవారు ఉన్నారు.

ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు హెల్త్ కేర్ సిబ్బందికి చాతిలో పట్టేసినట్టుగా అనిపించడంతో వారిని 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు.  తర్వాత ఇద్దరు సాధారణ స్థితికి వచ్చారు. మరో వ్యక్తి పరిస్థితి సీరియస్ కావడంతో అతడిని ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో అతడి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స చేసినా అతడి పరిస్థితి తగ్గలేదు. ఈ కేసును సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఇక రాజస్థాన్ రాష్ట్రంలోనే ఇలాంటి తరహా కేసులు 21 నమోదయ్యాయి.

దేశంలోనే తొలి టీకా తీసుకున్న వ్యక్తిగా ఢిల్లికి చెందిన ఎయిమ్స్ లో పనిచేసే పారిశుధ్య కార్మికుడు మనీష్ కుమార్ నిలిచారు. ఇక ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ మహేష్ శర్మ, పశ్చిమ బెంగాల్ తృణమూల్ ఎంపీ రవీంద్రనాథ్ చటర్జీలు దేశంలో తొలి కరోనా టీకా తీసుకున్న రాజకీయ నేతలుగా నిలిచారు.

తొలి రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసినందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్దన్ అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా మొత్తంగా 1,91,181 మందికి శనివారం వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 16,755 వ్యాక్సినేటర్లు,3352 సెషన్ల ద్వారా ఈ ప్రక్రియను నిర్వహించినట్లు పేర్కొంది.
Tags:    

Similar News