ముంబైలో కరోనా మరణాలు జీరో !

Update: 2021-10-18 07:50 GMT
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆదివారం ఒక్క కరోనా వైరస్ మరణం కూడా సంభవించలేదు. భారతదేశంలో కరోనా ప్రవేశించిననాటి అంటే మార్చి 2020 నుంచి ముంబైలో కరోనా మరణం సంభవించకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొదటి, రెండో కరోనా వేవ్‌ లో ముంబై లో అత్యధిక కేసులు, మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. కొత్తగా నగరంలో 367 కరోనా కేసులు నమోదయ్యాయని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై తెలిపింది. మార్చి 11, 2020లో ముంబైలో తొలి కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది. ఆ తర్వాత ఆరు రోజులకు కరోనా మరణం కూడా సంభవించింది. బీఎంసీ మున్సిపల్ కమిసనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ ముంబైలో తాజాగా ఒక్క మరణం కూడా సంభవించకపోవడంపై హర్షం వ్యక్తంచేశారు.

ఇది ముంబై నగర ప్రజలకు గొప్ప వార్త అని ఆయన అన్నారు. ఎంసీజీఎం బృందానికి శాల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియాతో సహా అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముంబైని సురక్షిత నగరంగా మార్చేందుకు అందరూ సహకరించాలని కోరారు. ముంబైలోని 97 శాతం జనాభా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుందని, ఇక 55 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. ఇప్పటి వరకు ముంబైలో 7,50,808 కరోనా కేసులు నమోదు కాగా, 16,180 మంది మరణించారు. ఇప్పటి వరకు 7,27,084 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ముంబై నగరంలో ఇప్పటి వరకు 1,09,57,392 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ముంబై నగరంలో 5030 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 97 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 0.06 శాతంగా ఉంది. మరోవైపు, దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 11 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించగా, 14,146 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇవి 229 రోజుల కనిష్టానికి చేరడం గమనార్హం. శనివారం 144 మంది కరోనా బారినపడి మరణించారు.

దీనితో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 4,52,142కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 19,788 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,34,19,749కి చేరింది. రికవరీ రేటు 98.10 శాతానికి చేరింది. గత సంవత్సరం మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల దిగువకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,95,846కి తగ్గింది. పాజిటివిటీ రేటు 0.57 శాతానికి తగ్గి 220 రోజుల కనిష్టానికి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగానే జరుగుతోంది. శనివారం 41,20,772 మందికి టీకాలు పంపిణీ చేయగా, ఇప్పటి వరకు ఏదో ఒక టీకా డోసు తీసుకున్నవారి సంఖ్య 97.65 కోట్లు దాటింది.


Tags:    

Similar News