వివాదాస్పద ఫోటోషూట్ : పాక్ మోడల్‌ను భారత్ సమన్లు

Update: 2021-12-01 04:02 GMT
పాకిస్తాన్ మోడల్ సౌలేహా తన దేశంలోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ని సందర్శించడానికి వెళ్ళింది. అయితే సందర్శిస్తే వస్తే ఎలాంటి గొడవలు ఉండేవి కావు.. కానీ ఇప్పుడు సందర్శించాక తీసుకున్న ఫోటోలు ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టాయి. సౌలేహా గురుద్వారాలో ఒక ఫోటోషూట్ చేయడం వివాదాస్పదమైంది. అది సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలలో గురుద్వారాలో ఆమె తన తలను కప్పి ఉంచకుండా ఫొటో దిగడం వివాదాస్పదమైంది.

కర్తార్‌పూర్‌లోని గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్ పవిత్రతను పాకిస్థానీ మోడల్ అపవిత్రం చేసిన ఘటనపై తీవ్ర ఆందోళనను తెలియజేసేందుకు ఈరోజు పాక్ చార్జ్ డి ఎఫైర్స్‌ను పిలిపించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ దుర్మార్గమైన సంఘటన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజం మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని తెలియజేసారు. పాకిస్తాన్‌లోని మైనారిటీ వర్గాల మతపరమైన ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేయడం.. అగౌరవపరచడం వంటి నిరంతర సంఘటనలు ఈ వర్గాల విశ్వాసం పట్ల గౌరవం లేకపోవడాన్ని ఎత్తి చూపుతున్నాయి.

'పాకిస్థానీ అధికారులు ఈ విషయాన్ని నిజాయితీగా విచారించాలని.. ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము,' అని విదేశాంగశాఖ తెలియజేసింది.

మోడల్ ఈ ఫొటోలు పోస్ట్ చేసిన తర్వాత దుమారం చెలరేగింది. దీంతో పోస్ట్‌ను తొలగించి, ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో క్షమాపణలు చెప్పింది. ఇది ఫోటోషూట్ కాదని ఆమె చెప్పుకొచ్చింది. చరిత్ర గురించి తెలుసుకోవడానికి.. సిక్కు సమాజం గురించి తెలుసుకోవడానికి కర్తార్‌పూర్ గురుద్వారాను సందర్శించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. కానీ సిక్కుల నుంచి మాత్రం ఆమెకు నిరసనలు తగ్గడం లేదు.
Tags:    

Similar News