మోడీకి షాకిచ్చిన కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి

Update: 2017-04-13 08:16 GMT
దేశంలో ఈ రోజున ఎవ‌రి నోటా విన్నా.. మోడీ గాలి వీస్తున్న‌ట్లుగా చెప్ప‌టం క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్లే ఈ మ‌ధ్య‌న వెలువ‌డిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌య‌ఢంకా మోగించ‌టంతో.. మొత్తం క్రెడిట్ మోడీ ఖాతాలోకి వెళ్లిపోయింది. యూపీ ఫ‌లితం నేప‌థ్యంలో మోడీకి తిరుగులేద‌ని.. ఆయ‌నంత బ‌ల‌మైన నేత దేశంలో మ‌రెవ‌రూ లేర‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని ప‌ది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిల్లో సింహ‌భాగం బీజేపీ విజ‌యం సాధించ‌గా.. ఆ పార్టీకి ఏ మాత్రం మింగుడుప‌డ‌ని రీతిలో క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఉప ఎన్నిక ఫ‌లితాలు రావ‌టం షాకింగ్‌ గా మారాయి.

మ‌రికొద్దినెల్ల‌లో క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. బీజేపీ ఈ ఉప ఎన్నిక‌ల మీద ప్ర‌త్యేక ఫోక‌స్ చేసింది. ద‌క్షిణాదిన ప‌ట్టు బిగించే ప‌నిలో భాగంగా తొలుత క‌ర్ణాట‌క‌లో పాగా వేయాల‌న్న ఆశ‌తో ఉన్నారు క‌మ‌ల‌నాథులు. ఇందుకు త‌గ్గ‌ట్లే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత ఎంఎస్ కృష్ణ‌ను కూడా ఈ మ‌ధ్య‌న పార్టీలోకి చేర్చుకోవ‌టం తెలిసిందే.

ద‌క్షిణాదిన క‌మ‌ల‌వికాసానికి తొలిమెట్టుగా భావిస్తున్న క‌ర్ణాట‌క‌లో తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ బొక్క‌బోర్లా ప‌డ‌టం.. కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌టం షాకింగ్ గా మారింది. సిద్ద‌రామ‌య్య ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉంద‌ని.. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీదే విజ‌య‌మ‌ని చెబుతున్న క‌మ‌ల‌నాథుల‌కు.. తాజా ఉప ఎన్నిక‌ల ఫ‌లితం క‌రెంటు షాక్ త‌గిలిన‌ట్లైంద‌ని చెప్ప‌క త‌ప్పుదు.

క‌ర్ణాట‌క‌లోని రెండు అసెంబ్లీ స్థానాల్లో(నంజ‌న్ గూడ‌.. గుండ్లుపేట‌) జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున బ‌ల‌మైన అభ్య‌ర్థులే రంగంలోకి దిగారు.అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. నంజ‌న్ గూడ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి 15వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధిస్తే.. గుండ్ల‌పేట‌లో కాంగ్రెస్ పార్టీ ప‌దివేల లోపు మెజార్టీతో గెలిచే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున విజ‌యం సాధించిన ఆనందం.. క‌ర్ణాట‌క‌లో ఎదురైన ఓట‌మితో క‌మ‌ల‌నాథుల మోము చిన్న‌బోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజా ఫ‌లితంతో ఎదురులేని రీతిలో సాగుతున్న ప్ర‌ధాని మోడీకి.. కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య షాకిచ్చిన‌ట్లు చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News