యోగిపై కొత్త వివాదం

Update: 2017-04-18 07:58 GMT
హిందూత్వ విధానాలు... పాల‌న‌లో డైన‌మిజంతో దూసుకెళ్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ను వివాదాలు ఇంకా వెంటాడుతున్నాయి. తాజాగా కొత్త వివాదం ఒక‌టి ముదురుతోంది. యోగి సొంత వెబ్ సైట్లో ఆయ‌న వెలువ‌రించిన అభిప్రాయాల్లో మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా ప‌లు వ్యాఖ్య‌లున్నాయంటూ కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.. యోగి తన వెబ్ సైట్లోని వీక్లీ జర్నల్ లో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించార‌ని... క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

'యోగి ఆదిత్యనాథ్ టాట్ ఇన్' వెబ్ సైట్లో కామెంట్ సెక్షన్ లో మొదటి స్థానంలో ఉన్న ఓ ఆర్టికల్ లో 'మహిళా శక్తిని చిన్నతనంలో తండ్రి - వయసు వచ్చిన తరువాత భర్త - వృద్ధాప్యంలో కుమారుడు రక్షించాలి. మహిళలను స్వతంత్రంగా, స్వేచ్ఛగా వదిలివేయరాదు' అని రాసి ఉంది. యోగి సొంత వెబ్ సైట్ కావ‌డంతో అది ఆయ‌న అభిప్రాయంగానే ప‌రిగ‌ణించాలి. దీంతో... నిత్యం మహిళల సమానత్వం, సాధికారతపై మాట్లాడే యోగి, తన వ్యాసంలో బీజేపీ మైండ్ సెట్ ను చెప్పకనే చెప్పారని కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

యోగి అభిప్రాయాల‌ను మోదీ - అమిత్ షాలు సైతం ఖండించకపోవడం శోచనీయమని కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి ర‌ణ‌దీప్ సుర్జేవాల్ అంటున్నారు.  వెంటనే  వెబ్ సైట్ నుంచి ఆ ఆర్టికల్ ను తొలగించి, మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఆర్టికల్ ఎప్పుడు అప్ లోడ్ చేశారన్న విషయం తెలియకపోయినా, ఇది కనీసం ఏడేళ్ల కింద‌టిది కావొచ్చ‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News