ఇందిరమ్మను మొదలు ఎవరినీ వదల్లేదు

Update: 2016-12-17 05:37 GMT
మనసులో ఆవేశాన్ని ముఖం మీద కనిపించకుండా.. నవ్వుతూ మాట్లాడటమే కాదు.. ప్రత్యర్థుల్ని మీటింగ్ కి పిలిచి మరీ కూల్ గా మాట్లాడి పంపించేయటం.. ఆ తర్వాత అదే ప్రత్యర్థుల్ని ఉతికి ఆరేసేలా వ్యాఖ్యలు చేయటం ప్రధాని మోడీకి మాత్రమే సాధ్యమవుతుందేమో. శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా తన ఛాంబర్ కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని.. ఆయన పరివారాన్ని మీటింగ్ కు పిలిచిన ప్రధాని.. వారితో కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ నేతలు వినతి పత్రాన్ని అందించారు.

రైతులకు ప్రభుత్వ పరంగా చేయాల్సినదేమిటో ప్రధాని మోడీకి వివరించిన కాంగ్రెస్ నేతలకు మోడీ నుంచి మౌనమే సమాదానంగా ఎదురైంది. తన దృష్టికి తీసుకొచ్చిన రైతుల సమస్యలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని మోడీ.. రాహుల్ ను ఉద్దేశించి.. తరచూ ఇలాంటి భేటీలు పెట్టుకుందామని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. అనంతరం వారిని సాగనంపారు.

కొన్ని గంటల అనంతరం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ.. కాంగ్రెస్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అవినీతికి ప్రియురాలిగా అభివర్ణించిన ఆయన.. ఆ పార్టీకి చెందిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీని మొదలుకొని తన ముందు ప్రధాని పదవిలో పదేళ్లు వ్యవహరించిన మన్మోహన్ సింగ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దేశ ప్రయోజనాల కన్నా.. పార్టీ ప్రయోజనాలకే కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. వామపక్షాల్ని సైతం వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ వైపునకు చేరిన వామపక్షాలు తమ సిద్దాంతం పట్ల రాజీ పడుతున్నాయని విమర్శించిన ఆయన.. వామపక్షానికి చెందిన దివంగత నేతలు జ్యోతిబసు.. హరికిషన్ సింగ్ సూర్జిత్ లాంటివారు పెద్దనోట్ల రద్దుకు మద్దతుగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసిన మోడీ.. తాజాగా వామపక్ష నేతల వైఖరిని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను విమర్శించిన మోడీ.. 1991లో పన్ను ఎగవేతదారులను ఉద్దేశించి కఠినంగా మాట్లాడిన మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గతంలో ఆయన చెప్పిన మాటల్ని ఇప్పుడు పూర్తిగా మార్చేశారన్న మోడీ.. మన్మోహన్ కు దేశం కంటే పార్టీకి సంబంధించిన ఆందోళనే ఎక్కువగా ఉందని.. అందుకే అలా మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల్ని విపక్షాలు అడ్డుకున్న వైనాన్ని తనదైన శైలిలో ఎదురుదాడి చేశారు. గతంలో పార్లమెంటు సమావేశాలు అడ్డుకోవటానికి కారణం భారీకుంభకోణాలు.. అవినీతి రాజకీయాలు అయితే.. ఈసారి మాత్రం అవినీతికి వ్యతిరేకంగా అధికారపక్షం చర్యలు తీసుకుంటే.. అవినీతిపరులకు మద్దుతుగా విపక్షాలన్నీ ఏకతాటి మీదకు రావటం ఇదే మొదటిసారంటూ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు.

1971లో ఒకసారి వాంఛూ కమిటీ పెద్దనోట్ల రద్దుకు సిఫార్సు చేసిందని చెబుతూ నాటి సంగతుల్నిమోడీ చెప్పుకొచ్చారు. నాటి ఆర్థికమంత్రి వైబీ చవాన్.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వద్దకు వెళ్లి వాంఛూ కమిటీ చేసిన సిఫార్సుల్ని ఆమోదించాల్సిందిగా ప్రధాని ఇందిరను కోరారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఒకే ఒక్క ప్రశ్న.. కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో పోటీ చేయకూడదా? అని ప్రశ్నించారని చెప్పిన మోడీ.. ‘‘పార్టీ పెద్దదా? దేశం పెద్దదా?’’ అంటూ సూటి ప్రశ్నను సంధించారు. 1988లో అధికారంలో ఉన్నప్పుడు బినామీ ఆస్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చట్టంచేసినా.. ఎప్పుడూ దాన్ని నోటిఫై చేయలేదన్న విషయాన్ని గుర్తు చేసిన మోడీ.. నియమ నిబంధనల్ని ఆ పార్టీ పాటించలేదన్నారు.

బీజేపీతో సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నప్పటికీ నోట్ల రద్దు నిర్ణయానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లు అండగా నిలిచారన్నారు. వారికి థ్యాంక్స్ చెప్పిన మోడీ.. నల్లధనంపై తమ సర్కారు చేస్తున్న యుద్ధంలో పెద్దనోట్ల రద్దు ఒక ముఖ్యమైన చర్య మాత్రమే కానీ.. అదే ఆఖరి గమ్యం కాదన్న కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో తన గళాన్ని వినిపించని మోడీ.. పార్టీ పార్లమెంటరీ సభ్యుల సమావేశంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News