ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ.. ఎక్కడి నుంచి పోటీ అంటే?

Update: 2021-03-06 04:30 GMT
ఏ రాజకీయ నేత అయినా ఎదగాలంటే అతడు ప్రజల్లోకి వెళ్లాలి.. వారిచే గెలవగలగాలి.. అప్పుడే అతడి నాయకత్వంలో ముందుకు సాగడానికి నేతలకు, ప్రజలకు భరోసానిచ్చిన వాడు అవుతాడు. మన టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు ఎమ్మెల్యేగా పోటీచేసి మరీ ఓడిపోవడంతో ఆయన నాయకత్వాన్ని కాదని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను రమ్మంటున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే డీలాపడిపోయిన కాంగ్రెస్ కు జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ అధినేత్రి కూతురు ప్రియాంకగాంధీ ప్రజల్లోకి వెళుతున్నారు. అసోంలో పర్యటించిన ఆమె తాజాగా పోటీ కూడా చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది..

కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం నింపాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం వాదిస్తున్నారు. ఏప్రిల్ 6న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నింపడానికి ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు జరిగే కన్యాకుమారి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీచేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ ఎంపీ, కన్యాకుమారి సిట్టింగ్ ఎంపీ వసంత కుమార్  కొద్దినెలల క్రితం కరోనా ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే తమిళనాడు అసెంబ్లీతోపాటు ఇక్కడా ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి పోటీచేయాలని ప్రియాంకను కార్తి చిదంబరం కోరుతున్నారు.

ప్రస్తుతం ప్రియాంక గాంధీ అసోం అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు తీసుకున్నారు. రాహుల్ గాంధీ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే అసోంలో పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తిరిగి గద్దెనెక్కించాలని ప్రియాంక పోరాడుతున్నారు.
Tags:    

Similar News