లోకేష్ మీద చంద్రబాబుకే ఫిర్యాదు

Update: 2022-02-26 04:30 GMT
లోకేష్ మీద చంద్రబాబునాయుడుకే ఫిర్యాదు చేసేంత ధైర్యం ఎవరికుంటుంది ? అంత ధైర్యం ఎవరు చేయరని అందరికీ తెలుసు. అయినా ఫిర్యాదు చేశారు. ఇంతకీ లోకేష్ మీద ఫిర్యాదు చేసిందెవరంటే ఆయన కొడుకు దేవాన్షే. ఈ విషయాన్ని వైజాగ్ పర్యటన సందర్భంగా లోకేషే చెప్పారు. ఎప్పుడూ ఇంటి దగ్గరే కూర్చునేబదులు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళటం లేదని తన కొడుకు దేవాన్ష్ అడిగాడట. తనను ఈ విషయమై అడగటమే కాకుండా ఏకంగా చంద్రబాబుతో ఫిర్యాదు కూడా చేసినట్లు లోకేష్ చెప్పారు.

లోకేష్ చెప్పింది విన్న తర్వాత పిట్టకొంచెం కూతఘనమని అర్ధమవుతోంది. మరి రాజకీయాలు వంట పట్టించుకుని జనాల్లో తిరగమని చెప్పేంత వయసు, జ్ఞానం దేవాన్ష్ కు ఉందో లేదో తెలీదు. ఒకపుడు అంటే లోకేష్ పదో తరగతి చదువుతున్నపుడు చంద్రబాబుకు ఇలాంటి సలహాలే ఇచ్చావాడట. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో 2009 ఎన్నికలకు ముందు చంద్రబాబే  స్వయంగా చెప్పారు.

2009 ఎన్నికల్లో మహాకూటమి ఆధ్వర్యంలో టీడీపీ+టీఆర్ఎస్+వామపక్షాలు ఎన్నికలను ఎదుర్కొంది. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ దెబ్బకు ఓడిపోయింది లేండి. అప్పట్లో ఎన్నికలకు ముందే మహాకూటమి నగదు బదిలీ పథకాన్ని ప్రకటించింది మ్యానిఫెస్టోలో పెట్టింది. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తు ఈ పథకాన్ని తన కొడుకు లోకేష్ చెప్పినట్లు చెప్పారు.

తన కొడుక్కు రాజకీయాల మీద బాగా ఆసక్తి ఉందని ఎప్పుడూ జనాల గురించే ఆలోచిస్తుంటాడని చెప్పుకుని చంద్రబాబు మురిసిపోయారు. అప్పట్లోనే లోకేష్ సామర్ధ్యంతో పాటు తెలివి తేటలపై బాగా సెటైర్లు పడ్డాయి. ఇపుడు దేవాన్ష్ గురించి లోకేష్ చెప్పగానే చాలామందికి అప్పట్లో లోకేష్ రూపొందించిన  నగదుబదిలీ పథకం విషయం గుర్తుకొచ్చింది.
Tags:    

Similar News