వాజ్ పేయి మరణం.. చైనా ఏజెన్సీ ఘోర తప్పిదం

Update: 2018-08-17 11:18 GMT
వాజ్ పేయి.. భారత దేశ మాజీ ప్రధానిగా.. బీజేపీ వ్యవస్థాపకుడిగా దేశంలో అందరికీ సుపరిచితమే.. కానీ చైనాలో ఎంతమందికి తెలుసు.. చాలా మందికి తెలియకపోవచ్చు. అక్కడి ప్రఖ్యాత మీడియా సంస్థలు కూడా వాజ్ పేయి మరణంపై కథనాలు రాస్తున్నాయి. కానీ ప్రఖ్యాత చైనా జిన్హువా న్యూస్ మాత్రం మాజీ ప్రధాని వాజ్ పేయి మరణ వార్త విషయంలో ఘోర తప్పిదం చేసింది. భారత మాజీ ప్రధాని మరణించాడంటూ ట్విట్టర్ లో వార్త పోస్టు చేసి వాజ్ పేయి ఫొటోకు బదులుగా   బీజేపీ అగ్రనేత జార్జ్ ఫెర్నండేజ్ ఫొటోను పోస్టు చేసింది.

జార్జ్ ఫెర్నండేజ్ .. వాజ్ పేయి కేబినెట్ లో రక్షణమంత్రిగా పనిచేశారు. చైనా న్యూస్ ఏజెన్సీ చేసిన ఈ ట్వీట్ పై భారతీయ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. చీప్ జర్నలిజం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కనీసం భారత మాజీ ప్రధాని ఫొటోను కూడా గుర్తుపడడం రాదా అని చైనా తీరును తప్పుపడుతున్నారు.

నెటిజన్ల ట్రోలింగ్ దెబ్బకు వెంటనే రియాక్ట్ అయిన జిన్హువా ఏజెన్సీ ఆ ట్వీట్ ను తొలగించింది. వాజ్ పేయి ఫొటోను పెట్టి మళ్లీ వార్త పోస్టు చేసింది. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  భారతీయ నెటిజన్లు సదురు సంస్థను వదలకుండా కామెంట్ల వర్షం కురిపించారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని మార్చారు అంటూ కొందరు ట్వీట్లు చేశారు.
Tags:    

Similar News