సాయి ధరమ్ తేజ్‌ పై దాడి కథనాలపై పోలీసుల వివరణ ఇదే!

అత్యంత రసవత్తరంగా జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పలు దారుణమైన సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-07 06:58 GMT

అత్యంత రసవత్తరంగా జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పలు దారుణమైన సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ప్రచార కార్యక్రమాల్లో ఉన్న నేతలు, స్టార్ క్యాంపెయినర్ల పై పలువురు దుండగులు భౌతిక దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో... సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ పై పిఠాపురంలో దాడి జరిందంటూ వస్తున్న కథనాలపై పోలీసులు స్పందించారు.

అవును... సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో జరుగుతున్న ప్రచార కార్యక్రమాల్లో సమర్ధనీయం కాని పలు ఘటనలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే దాడిచేసి గాయపరిచన దారుణ ఘటన ఈ ఎన్నికల సమయంలో జరిగింది! ఈ నేపథ్యంలో... సాయి ధరమ్ తేజ్ పై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై కాకినాడ జిల్లా పోలీసులు స్పందించారు.

వివరాళ్లోకి వెళ్తే... కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో సినీనటుడు, పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పై దాడి జరిగిందంటూ కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... వైసీపీ కార్యకర్తలు సాయి ధరమ్ తేజ్‌ పై బీర్ బాటిళ్లతో దాడి చేశారని, ఈ సమయంలో గాయపడిన జనసేన కార్యకర్తను పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారని వార్తలు వచ్చాయి.

దీంతో... ఎన్డీయే కూటమి చేతిలో ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ భౌతిక దాడికి పాల్పడిందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌. వర్మ ఫైరయ్యారు! అయితే ఈ ఘటనలో సాయి ధరమ్ తేజ్ కి ఏమాత్రం ప్రమేయం లేదని కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు మీడియాకు స్పష్టం చేశారు! ఈ మేరకు నాడు జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు.

Read more!

ఇందులో భాగంగా... సాయి ధరమ్ తేజ్ తన వాహనాన్ని గ్రామ శివారులో నిలిపి కాలినడకన ప్రచారానికి వెళ్లగా, గ్రామంలోని వైఎస్సార్‌సీ కార్యకర్త నల్లా శ్రీధర్‌ పై గుర్తు తెలియని వస్తువును విసిరారని డీఎస్పీ తెలిపారు. దీంతో శ్రీధర్ తలకు స్వల్పంగా గాయమైందని.. చికిత్స పొందిన అనంతరం అతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడని వెల్ల్డించారు.

ఇదే సమయంలో... ఘటనా స్థలంలో ఎలాంటి సీసాలు, ఇతర వస్తువులు లభించలేదని చెప్పిన డీఎస్పీ హనుమంతరావు.. ఇద్దరు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News