ప్రగతిభవన్.. ఫాంహౌస్ లో ఉండమన్నది ఎవరు కేసీఆర్?

ఇక.. తన చేతికి అధికారాన్ని ఇచ్చిన ప్రజల విషయంలోనూ ఆయన తీరు ఏకపక్షంగా ఉందన్నది మర్చిపోకూడదు.

Update: 2024-05-07 07:30 GMT

చాలా చికాకుగా ఉంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. తెలంగాణలో తనకు తిరుగులేదని భావించిన ఆయన.. తమ చేతుల్లోనే కనీసం రెండు దశాబ్దాలకు పైనే అధికారం ఉంటుందని ఆశించారు. అందుకు తగ్గట్లే పావులు కదిపారు. తను ప్రశ్నించేందుకు పార్టీలు.. నేతల్ని లేకుండా చేసిన కేసీఆర్.. ఎవరైనా తన లోపాల్ని.. తప్పుల్ని ఎత్తి చూపితే వారిని ఏం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక.. తన చేతికి అధికారాన్ని ఇచ్చిన ప్రజల విషయంలోనూ ఆయన తీరు ఏకపక్షంగా ఉందన్నది మర్చిపోకూడదు. ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో ప్రజల వద్దకు వెళ్లొద్దని ఆయన్ను ఎవరైనా ఆపారా? ప్రజల్ని కలుసుకుంటానని చెబితే ఎవరైనా నో అని చెప్పేసి.. ఆయన్ను ప్రగతిభవన్ కు.. పాంహౌస్ కు పరిమితం చేశారా? ఆయనకు ఆయనే.. బయటకు రాకుండా.. తన వద్దకు ఎవరూ రాకుండా చేసుకున్న కేసీఆర్.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ.. బస్సుయాత్ర చేపట్టిన కేసీఆర్.. ప్రజలతో మమేకం కావాల్సిన అవసరాన్ని గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అందుకే తన తీరును ఆయన మార్చుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను చెప్పేవాడు.. ప్రజలంతా వినేవాళ్లన్నట్లుగా ఆయన తీరు ఉండేది. ఎందుకంటే.. తాను చెప్పింది వింటూ.. తూచా తప్పకుండా వినే వారిని గొర్రెలుగా భావించే ఆయన.. ఆ గొర్రెల మందను కలిసేందుకు ఆసక్తి చూపేవారు కాదు.

Read more!

తాను భావించిన గొర్రెల మంద సైతం ఆలోచించే శక్తి ఉంటుందని.. వారి చేతిలో ఓటు అనే వజ్రాయుధం ఉంటుందని.. తాను నిర్మించుకున్న రాజసౌధాలన్నీ వారు లాగేసుకుంటారని.. తనను రోడ్డు మీదకు తీసుకొస్తారన్న విషయాన్ని ఆయన ఊహించి ఉండరు. ఎప్పుడైతే తన అంచనాలు తప్పని తేలి.. చేతిలో ఉన్న అపరిమితమైన రాజదండం మాయం కావటంతో.. దాన్ని సాధించేందుకు ఆయన మెదడు పాదరసం మాదిరి కదులుతోంది.

అందుకే.. ప్రజల్ని దూరంగా ఉంచే కేసీఆర్.. ఇప్పుడు అదే ప్రజలకు చేరుగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తన తప్పుల్ని దాచుకునేందుకు.. తన దగ్గర నమ్మకంగా ఉండే నేతలపై చిరాకు పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న దుకాణాల వద్ద ఆగి.. అక్కడి వారితో ముచ్చట్లు పెడుతున్న కేసీఆర్ తో ఫోటోలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆ ఉత్సాహాన్ని బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్న వారిని నిలువరిస్తూ వారిపై విరుచుకుపడుతున్నారు.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి.తనకు ఇష్టం లేకుండా తన దగ్గరకు ఎవరైనా వస్తే.. వచ్చినోళ్లను కాకుండా అలా వచ్చేందుకు కారణమైన సెక్యూరిటీ వారికి.. నేతలకు క్లాస్ పడుతుంది. అందుకే.. అధినేత మనసులో ఏముందో అర్థం కాని వారు.. కేసీఆర్ వద్దకు వస్తున్న వారి విషయంలో కాస్తంత ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వేళ.. కేసీఆర్ రియాక్టు అవుతూ.. ‘‘మీలాంటి నాయకుల వల్లే పార్టీ అధికారం కోల్పోయింది’’ అంటూ విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ ఆగ్రహాన్ని చూసినప్పుడు.. ఇప్పటికి మీ నోటి దూల తగ్గదా మాష్టారు? అనుకోకుండా ఉండలేం. ప్రజల వద్దకు రావొద్దని.. ప్రగతిభవన్ లోనూ.. ఫాంహౌస్ లోనే రోజుల తరబడి ఉండిపోవాలని ఏ నేత చెప్పలేదేం? తనకు తానుగా తనకు నచ్చినట్లుగా చేసి... తనను నమ్మకున్న వారికి అధికారం లేకుండా చేసినందుకు గులాబీ దండు కేసీఆర్ ను నిందించాలి. అందుకు భిన్నంగా ఆయనే రివర్సులో తగులుకోవటం చూస్తే.. కేసీఆరా మజాకానా? అనుకోకుండా ఉండలేం.

Tags:    

Similar News