ట్రంప్ హెచ్చరిస్తే..చైనా చాలెంజ్ చేసింది

Update: 2016-12-12 10:33 GMT
అమెరికా కాబోయే అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార ప‌గ్గాలు చేపట్ట‌క‌ముందే వివాదాల్లో త‌ల‌దూరుస్తున్నారు. ఐసిస్ విష‌యంలో ఇప్ప‌టికే దూకుడుగా వెళ్తున్న ట్రంప్ తాజాగా వాణిజ్యంలో అమెరికాకు పోటీ ఇచ్చే చైనాతో సై అంటే సై అంటున్నారు. ఈ క్ర‌మంలో చైనాపై ట్రంప్ దూకుడు వ్యాఖ్య‌లు చేయ‌గా...డ్రాగ‌న్ దేశం సైతం అదే రీతిలో ప్ర‌పంచ పెద్ద‌న్న‌కు గ‌ట్టి రిప్లై ఇచ్చింది.

అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ సంస్థ‌తో ట్రంప్ మాట్లాడుతూ ఇటీవ‌ల చైనా దేశంలో తైవాన్ భాగ‌మ‌నే వ‌న్ చైనా పాల‌సీ గురించి తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. అమెరికా వాణిజ్యం విష‌యంలో ఏమాత్రం రాయితీలు ఇవ్వ‌న‌పుడు.. మ‌నం మాత్రం వ‌న్ చైనా పాల‌సీకి ఎందుకు క‌ట్టుబ‌డి ఉండాల‌ని ట్రంప్ ప్ర‌శ్నించారు. "వ‌న్ చైనా పాల‌సీ ఏంటో నాకు తెలుసు. కానీ ఆ దేశం వాణిజ్యంతోపాటు ఇత‌ర అంశాల్లో మ‌న‌కు స‌హ‌క‌రించ‌క‌పోతే.. వ‌న్ చైనా పాల‌సీకి మ‌నం ఎందుకు క‌ట్టుబ‌డి ఉండాలి. త‌మ క‌రెన్సీ విలువ‌ను చైనా త‌గ్గించడం వ‌ల్ల అమెరికా తీవ్రంగా న‌ష్ట‌పోయింది. వాళ్ల వ‌స్తువుల‌పై మ‌నం ప‌న్ను విధించ‌క‌పోయినా.. మ‌న వ‌స్తువుల‌పై వాళ్లు భారీగా పన్నులు వ‌సూలు చేస్తున్నారు. దక్షిణ చైనా స‌ముద్రంలో భారీగా సైన్యాన్ని మోహ‌రించింది. అలా చేసి ఉండాల్సింది కాదు"అని ట్రంప్ స్ప‌ష్టంచేశారు. ఉత్త‌ర కొరియా విష‌యంలోనూ చైనా అమెరికాకు సాయం చేయ‌డం లేద‌ని ట్రంప్ ఆరోపించారు. "ఉత్త‌ర కొరియా ద‌గ్గ‌ర అణ్వాయుధాలు ఉన్నాయి. చైనా త‌లుచుకుంటే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌దు. కానీ ఆ దేశం ఏమాత్రం సాయం చేయ‌డం లేదు. అందువ‌ల్ల చైనా నన్ను ఏ విష‌యంలోనూ ఆదేశించ‌లేదు"అని ట్రంప్ తేల్చి చెప్పారు.

తైవాన్ త‌మ దేశంలోనే భాగ‌మ‌న్న చైనా వాద‌న‌ను 1979 నుంచి అమెరికా గౌర‌విస్తూ వ‌స్తోంది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన త‌ర్వాత తైవాన్ అధ్యక్షురాలితో ఆయ‌న ఫోన్‌లో మాట్లాడ‌టం చైనాకు మింగుడుప‌డ‌క‌పోవ‌డంతో ఇది వివాదంగా మారింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.."తైవాన్ అధ్యక్షురాలితో ఫోన్‌లో మాట్లాడితే త‌ప్పేమిటి? ఆమెనే నాకు కాల్ చేసింది. నేను చేయ‌లేదు. అది కూడా కొద్దిసేపే మాట్లాడాము. విజ‌యం సాధించినందుకు అభినందించారు. అయినా నేను ఆమెతో ఫోన్‌లో మాట్లాడ‌కూడ‌ద‌ని మ‌రో దేశం ఎలా ఆదేశించ‌గ‌ల‌దు. ఇది చాలా అమ‌ర్యాదక‌రం" అని ట్రంప్ అన్నారు.

అయితే ట్రంప్ త‌మ దేశం విష‌యంలో తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో చైనా సైతం ఘాటుగా స్పందించింది. తైవాన్‌కు ట్రంప్ మ‌ద్ద‌తిస్తే లేదా ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని వాణిజ్యంపై బేరాలాడితే అమెరికా శ‌త్రుదేశాల‌కు మిల‌ట‌రీ సాయం చేయ‌డానికి కూడా వెనుకాడ‌బోమ‌ని చైనా స్ప‌ష్టంచేసింది."ఒక‌వేళ ట్రంప్ వ‌న్ చైనా పాల‌సీకి స్వ‌స్తి ప‌లికి తైవాన్ స్వాతంత్య్రానికి బాహాటంగా మ‌ద్ద‌తిస్తే.. ఇక అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల్లో అమెరికాతో మాకు ఎలాంటి సంబంధాలు ఉండ‌వు. అగ్ర‌రాజ్య శ‌త్రుదేశాల‌కు మిల‌ట‌రీ సాయం చేస్తాం" అని చైనా ప్ర‌భుత్వ పత్రిక గ్లోబ‌ల్ టైమ్స్ త‌మ ఎడిటోరియ‌ల్‌లో హెచ్చ‌రించింది. మ‌న వాణిజ్యానికి స‌హ‌క‌రించ‌న‌పుడు వ‌న్ చైనా విధానానికి క‌ట్టుబ‌డి ఉండాల్సిన అవ‌స‌రం ఏంటని ట్రంప్ ప్ర‌శ్నించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే చైనా నుంచి ఈ వార్నింగ్ రావ‌డం గ‌మ‌నార్హం.

ట్రంప్ వ్యాపార‌వేత్త ధోర‌ణిని గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక త‌ప్పుబ‌ట్టింది. "వ‌న్ చైనా పాల‌సీ అమ్మ‌కానికి లేదు. ప్ర‌తి దానికీ విలువ క‌ట్టొచ్చ‌న్న ఆలోచ‌నా విధానం ట్రంప్‌కు ఉన్నంత‌వ‌ర‌కు ఆయ‌న ఇలా కొనుగోలు, అమ్మ‌కాలు చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ అమెరికా రాజ్యాంగానికి ఒక విలువ క‌డితే అక్క‌డి ప్ర‌జ‌లు దానిని అమ్ముకొని ఏ సౌదీ అరేబియానో లేక సింగ‌పూర్ వ్య‌వ‌స్థ‌నో అమ‌లు చేసుకుంటారా?"అని ఆ ఎడిటోరియ‌ల్ ప్ర‌శ్నించింది. చైనాలో తైవాన్ భాగ‌మ‌న్న వ‌న్ చైనా విధానానికి అమెరికా మ‌ద్ద‌తు ప‌లుకుతుండ‌గా.. ట్రంప్ మాత్రం దానిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తుండ‌టంపై చైనీయులు మండిప‌డుతున్నారు. ట్రంప్‌వి అప‌రిప‌క్వ వ్యాఖ్య‌ల‌ని, అమెరికా- చైనా మ‌ధ్య సంబంధాలకు ఎంత ప్రాముఖ్య‌త ఉందో ఆయ‌న‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాలని  చైనాలోని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.  ఆ మేర‌కు ఒత్తిడి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చైనా విదేశాంగ వ్య‌వ‌హారాల యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ లీ హైడాంగ్ అన్నారు.
Tags:    

Similar News