మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తు సమావేశం.. కారణం ఇదేనా?

Update: 2020-11-12 04:00 GMT
ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అనుకోని రీతిలో బుధవారం రాత్రి.. అందుబాటులో ఉన్న మంత్రులంతా గురువారం నిర్వహించే మంత్రుల సమావేశానికి హాజరు కావాలంటూ సమాచారం అందింది. దీనికికారణం ఏమిటన్న విషయంపై స్పష్టత లేకున్నా.. జీహెచ్ఎంసీ ఎన్నికలే అంశమని చెబుతున్నారు. ఈ సమావేశం తర్వాత రెండు రోజుల వ్యవధిలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించే వీలున్నట్లుగా తెలుస్తోంది.

ఇంత అకస్మాత్తుగా మంత్రులతో భేటీ కావటానికి కారణం ఏమిటన్న అంశం ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశమే ప్రధాన ఎజెండాగా చెబుతున్నారు. తొలుత నవంబరు చివరి నాటికి నోటిఫికేషన్ విడుదల చేయాలన్న ఆలోచన చేశారు. అంతలోనే విరుచుకుపడిన వరదలు.. సహాయక కార్యక్రమాల నేపథ్యంలో జనవరి చివర్లో నోటిఫికేషన్ వచ్చేలా చూసుకోవాలన్న మాట వినిపించింది.

తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి వరకు ఆగకుండా.. పది రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ విడుదల అయితే బాగుంటుందన్న ఆలోచన చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ కోసం తాజా సమావేశాన్ని నిర్వహించనున్నట్లుగా చెబుతున్నారు. ఎందుకింత హడావుడిగా అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కావాలని భావిస్తున్నారన్న విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Tags:    

Similar News