చంద్రబాబు పక్కా.. కేసీఆర్ మాటేమిటి?

Update: 2015-07-29 05:18 GMT
గత కొద్ది నెలలుగా ఎడముఖం.. పెడముఖంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక చోట కలిసే సన్నివేశం చోటు చేసుకోనుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకూ పలు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఎవరో ఒకరి కారణంగా ఈ ఇరువురు ముఖ్యమంత్రులు కలవలేని పరిస్థితి. ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కలుపుదామని గవర్నర్ నరసింహన్ ఎంతగా ప్రయత్నించినా ససేమిరా అన్నట్లు చెబుతారు.

శుభకార్యాలలో ఒకరికొకరు కలవకుండా ఉంటున్నరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విషాద సమయంలో ఒకే చోట కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాం అంతిమ సంస్కారాలు తమిళనాడులోని రామేశ్వరంలో గురువారం ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానితో సహా.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

మిగిలిన వారి సంగతేమో కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పనిసరిగా హాజరవుతారని చెబుతున్నారు. కలాంను రాష్ట్రపతిగా ఒప్పించిన చంద్రబాబు.. ఆయనకు చాలా సన్నిహితులు. ఈ నేపథ్యంలో తనకు ఆప్తుడైన కలాంకు అంతిమ వీడ్కోలు పలికేందుకు బాబు హాజరు ఖాయమంటున్నారు. మరి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళతారా? లేదా? అన్నది ఇంకా స్పష్టత రాని పరిస్థితి. ఒకవేళ కేసీఆర్ సైతం అంతిమసంస్కారాలకు వెళ్లిన పక్షంలో ఈ ఇరువురు ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద కలిసే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News