ఇక రోడ్ల మీదే చంద్రబాబు..!

Update: 2019-10-28 05:54 GMT
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. వైసీపీ అధినేత జగన్ 151 సీట్లు సాధించి అఖండ మెజార్టీ సాధించారు. వచ్చే ఐదేళ్లకు కూడా టీడీపీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక టీడీపీపై అపనమ్మకంతో ఇప్పటికే నాయకులు బీజేపీ - వైసీపీ బాట పడుతున్నారు. దీంతో తిరిగి టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడానికి చంద్రబాబు రెడీ అవుతున్నారు. వచ్చే రెండు నెలల పాటు ప్రతీ వారం ఏదో ఒక కార్యక్రమం రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలని.. రోడ్లపైనే ఉండాలని ప్లాన్ చేశారు. 

చంద్రబాబు  ఈ నెల 29 నుండి మొదలై డిసెంబర్ 24 వరకు ప్రజల్లోనే ఉండడానికి ప్లాన్ చేశారు.  ఇక ప్రతీ శనివారం - ఆదివారం హైదరాబాద్ లో కుటుంబంతో కలిసి ఉండటానికి వీలుగా షెడ్యూల్ లో ఆ రోజులకు మినహాయింపునిచ్చినట్టు తెలిసింది.

ఏపీని ఐదేళ్లు పాలించిన మాజీ సీఎం చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ లో అసలు సొంత ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. సీఎంగా దిగిపోయాక చంద్రబాబు పూర్తి తన ఇంటి కార్యక్రమాలు - సేదతీరేందుకు వీకెండ్ లలో హైదరాబాద్‌ లోనే ఉండి - వారపు రోజుల్లో మాత్రమే ఏపీకి తిరిగి వస్తున్నాడు.
 
చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికలో భాగంగా ప్రతీ జిల్లాలో కనీసం మూడు రోజులు గడపడానికి వీలుగా పర్యటనలు రూపొందించారు. కడప - విజయనగరం జిల్లాలో మాత్రం రెండు రోజులు పర్యటన మాత్రమే పెట్టుకున్నాడు. .

చంద్రబాబు జిల్లాల పర్యటన కృష్ణా జిల్లా నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా చిత్తూరు - అనంతపురం - పశ్చిమ గోదావరి - కడప - కర్నూలు - ప్రకాశం - గుంటూరులలో పర్యటిస్తారు. ఆ తరువాత క్రిస్మస్ వేడుకల కోసం హైదరాబాద్ బయలుదేరే ముందు విజయనగరంలో తన పర్యటనను ముగిస్తారు.

ఘోర ఓటమితో నిస్తేజంగా మారిన టీడీపీ క్యాడర్ కు జవసత్వాలు నింపడానికి. పార్టీని గ్రామ స్థాయి నుంచి పునరుద్ధరించడానికి - రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు నాయకులను సిద్ధం చేయడానికి చంద్రబాబు ఈ రెండు నెలలు ప్రజల్లోనే టీడీపీ క్యాడర్ తోనే ఉండాలని డిసైడ్ అయ్యారు.

అధికార వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసెంబరులో లేదా జనవరి చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని భావిస్తోంది. ఆ సమయానికి గ్రామ సచివాలయాలు కోరుకున్న విధంగా పనిచేస్తాయని ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ జిల్లాల పర్యటనతో దెబ్బతిన్న పార్టీకి మళ్లీ కొంత ఊపిరి పోసేందుకు చంద్రబాబు ప్లాన్ చేసినట్టు సమాచారం.

అంపశయ్య మీద ఉన్న టీడీపీని బతికించడం.. భవిష్యత్తు బాగా ఉంటుందని నేతలకు భరోసా ఇవ్వడం కోసమే చంద్రబాబు ప్రజల బాట పట్టారు. మరి ఆయన ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందనేది వేచిచూడాలి.
Tags:    

Similar News