ముద్రగడ అనుమతికి అంత పట్టు ఎందుకంటే?

Update: 2017-07-23 17:31 GMT
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం – రాష్ట్ర రాజధాని అమరావతి వరకు సంకల్పించిన పాదయాత్రకు ఇంకా రెండు మూడు రోజుల గడువే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాదయాత్రను జరగనివ్వకూడదని ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తోంది. ముద్రగడ అనుమతి అడగలేదని - తాము ఇప్పటిదాకా అనుమతి ఇవ్వలేదని పోలీసు అధికారులు ఒకవైపు - ముద్రగడ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం అని హోం మంత్రి ఒకవైపు రకరకాలుగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఒక రకంగా చూస్తే..  ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ముద్రగడ తాను తలపెట్టిన పాదయాత్రకు అనుమతి అడగాలి.. అని చాలా పట్టుదలతో వాదిస్తున్నట్లుగా ఉంది. ఇంతకూ సామాన్యులకు అర్థంకాని సంగతి ఒక్కటే..! ఆయన అనుమతి అడగాల్సిందే అంటూ ప్రభుత్వ వర్గాలు ఎందుకింత పట్టుబడుతున్నాయి. అనుమతి అడగడం గురించి ముద్రగడ ఎందుకు నిరాకరిస్తున్నారు. దాని వెనుక ఉన్న మతలబు ఏమిటి? అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

ఇందులో మరొక సీక్రెట్ ఉంది. పాదయాత్రకు అనుమతి అడుగడం అంటే అందులో చాలా మడతపేచీలు ఉన్నాయి. కేవలం నేను పాదయాత్ర చేయదలచుకుంటున్నా అనుమతి పత్రం ఇవ్వండి అని అడిగితే సరిపోదు. అలా అడిగినప్పుడు.. ‘తమరు మరొక అఫిడవిట్ ఇస్తే అనుమతి ఇస్తాం’ అంటూ పోలీసులు మెలిక పెడతారు. సదరు అఫిడవిట్లో.. ‘ఈ పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవు, శాంతి యుత వాతావరణంలో మాత్రమే జరుగుతుంది.. ఉద్రిక్తతలు ఉండవు.. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా - అల్లర్లు జరిగినా - నష్టాలు దారుణాలు వాటిల్లినా వాటికి నేను బాధ్యత వహిస్తాను’ అని కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఆ మేరకు పాదయాత్ర అనుమతి కోరే వ్యక్తి... అఫిడవిట్ లో అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నాయకులు ఇలాంటి అండర్ టేకింగ్ ఇవ్వడం అనేది ఆత్మహత్యా సదృశమే..! ఎందుకంటే.. పోలీసులకే దురుద్దేశాలు ఉంటే గనుక.. ఏదో ఒకమూల ఓ నలుగురు కుర్రాళ్లను చితకవాది.. ఈ అల్లర్లకు పాదయాత్రే కారణమంటూ.. అనుమతి కోరిన వ్యక్తి మీద తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ముద్రగడను అరెస్టు చేసి , తలచుకుంటే బెయిలుకు కూడా అవకాశం లేకుండా జైల్లో పెట్టడం వారికి సాధ్యం అవుతుంది. పాలక పక్షం లోని నాయకులు - ‘‘ఇందులో ప్రత్యేకంగా మేం జోక్యం చేసుకునేది ఏమీ ఉండదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అనే డైలాగుతో ఎప్పటిలాగే తప్పించుకోవచ్చు. అలాంటి దీర్ఘకాలిక స్కెచ్ ఒకటి దాగున్నది గనుకనే.. ముద్రగడ అనుమతి అడగడానికి ధైర్యం చేయడం లేదు. తమలో ఇలాంటి ఆలోచన ఉన్నది గనుకనే.. ముద్రగడ అనుమతి అడగాల్సిందే అంటూ ప్రభుత్వం మంకు పట్టు పడుతోంది. అద్గదీ సంగతి.
Tags:    

Similar News