శాలువా కప్పి.. షేక్ హ్యాండ్ మాత్రం ఇచ్చారు

Update: 2015-10-06 03:39 GMT
మనసులో కోపం ఉన్నా.. పైకి మాత్రం నవ్వుతూ కనిపించటం.. అవసరానికి తగినట్లుగా వ్యవహరించటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలవాటు. ఎవరినీ పూర్తిగా తీసి పక్కన పెట్టటం అన్నది ఆయన చేయరు. తనకు పెద్ద ఇష్టం లేకున్నా.. కొన్ని సందర్భాల్లో సర్లే.. పోనిద్దు అన్నట్లుగా ఉంటారే కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి కరుకుగా ఉండేందుకు ఇష్టపడరు. తాజాగా ఆ వైనం మరోసారి నిరూపితమైంది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్  నరసింహన్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటీముట్టనట్లు ఉంటున్న సంగతి తెలిసిందే. ఓటుకు నోటు వ్యవహారం.. ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య  చోటు చేసుకున్న వ్యవహారాల్లో గవర్నర్ తనకు అనుకూలంగా వ్యవహరించలేదని.. తెలంగాణ సర్కారు వైపే ఆయన ఎక్కువగా మొగ్గు చూపినట్లుగా బాబు భావిస్తున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతుంటాయి. గవర్నర్ వైఖరిపై గుంభనంగా ఉండే బాబు సైతం.. బాహాటంగానే చిరాకు పడిన పరిస్థితి.

అనంతరం.. గవర్నర్ ను కలవటం దగ్గర నుంచి.. అవసరమైన అంశాల్ని బ్రీఫ్ చేయటం వరకూ దాదాపుగా అన్నిటికి బాబు కత్తెర వేయటం కనిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటే.. బాబు మాత్రం దాదాపుగా కలవటమే తగ్గించేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. గవర్నర్ నరసింహన్ ను కలిశారు.

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీకి ఆహ్వానం అందించేందుకు వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీలో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ రావాల్సిన నేపథ్యంలో ఈ భేటీ జరిగిందని చెబుతున్నారు. శంకుస్థాపనకు రావాల్సిందిగా ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన్ను పిలిచారు.

ఇలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురైతే.. వ్యవహారం మరోలా ఉండేది. కానీ.. అక్కడ ఉన్నది చంద్రబాబు కావటంతో.. మనసులో ఎలా ఉన్నా.. చిరునవ్వుతో గవర్నర్ ను కలవటమే కాదు.. శాలువా కప్పి.. షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఫోటోలకు ఫోజిచ్చేసి.. శంకుస్థాపనకు తప్పనిసరిగా రావాలని చెప్పేసి.. తమ మధ్య అంతా బాగానే ఉంది సుమా అన్నట్లుగా వ్యవహరించటం కనిపించింది.
Tags:    

Similar News