సంపాదనలో తాత కంటే ఎక్కువంట..ఏమిటో ఆ లెక్కలు

Update: 2020-02-21 08:45 GMT
ఏ ఉద్దేశంతో ప్రతియేటా నారా కుటుంబం ఆస్తులు  ప్రకటిస్తుందో తెలియదు.. కానీ ఆ ఆస్తుల ప్రకటన చూస్తుంటే లెక్కలు.. తిక్క పుట్టిస్తాయి. ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ కూడా అర్థం చేసుకోలేనంత వారి లెక్కలు ఉంటాయి. తాజాగా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ తమ కుటుంబ ఆస్తులను వెల్లడించాడు. అయితే ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. తాత చంద్రబాబు - తండ్రి లోకేశ్ కన్నా నారా దేవాన్ష్ కోటీశ్వరుడయ్యాడు. అందరి కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వ్యక్తిగా బాలకృష్ణ మనవడు గుర్తింపు పొందాడు. ఈ విషయాన్ని తండ్రిగా లోకేశ్ ఆనందంతో ప్రకటించాడు. అయితే ఎలా అయ్యాడో.. ఏ విధంగా అయ్యాడో మాత్రం ప్రకటించలేదు. ఆ లెక్కలను చూపించి ఎవరినీ మెప్పించాలని ప్రయత్నిస్తున్నారో అర్థం కావడం లేదు.

ఆరేళ్ల పిల్లాడు.. దశాబ్దంన్నర పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి కన్నా అధికంగా ఆస్తులు కలిగి ఉండడం విస్మయం కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో వారు ప్రకటించిన ఆస్తులను మూడేళ్లతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. నారావారిపల్లెలో నివసిస్తున్న చంద్రబాబు తల్లి దేవాన్ష్ కు హైదరాబాద్ మదీనగూడలోని ఐదెకరాల స్థలం ఇచ్చారు. ఆ భూమి విలువ రూ.2.21 కోట్లు ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు తాతలు చంద్రబాబు - బాలకృష్ణ తమ మనవడు దేవాన్ష్ కు భారీ ఎత్తున ఆస్తులు ప్రకటించారు. దేవాన్ష్ పేరు మీద ఆస్తులు రాశారు. దీంతో దేవాన్ష్ ఆరేళ్లల్లోనే అపర కోటీశ్వరుడయ్యాడు. మొత్తానికి లోకేశ్ పేరు మీద రూ.19.42 కోట్లు ఉన్నాయని ప్రకటించారు.

అయితే ప్రతియేటా నారి కుటుంబసభ్యుల ఆస్తుల ప్రకటన హాస్యస్పదమవుతోంది. ఆ లెక్కల్లో జిమ్మిక్కులు ఉండడంతో అందరూ నవ్వుతున్నారు. నవ్విపోదురంటే నాకేంటి అనే వైఖరితో నారా కుటుంబ వ్యవహారం కొనసాగుతోంది. అయితే ఐటీ దాడుల నేపథ్యంలో ఆస్తుల ప్రకటన చేయడంతో ఏదో పెద్ద డ్రామాతో వీటిని ప్రకటించారని తెలుస్తోంది. వరుసగా తొమ్మిదేళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్నామని చెబుతున్నా ఏనాడైనా వాస్తవంగా తెలిపారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆస్తుల ప్రకటనపై అధికార పార్టీ నాయకులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ లో స్పందిస్తూ ఓ ఆట ఆడుకున్నారు.

ఈ లెక్కలన్నీ పరిశీలిస్తుంటే చంద్రబాబు - బాలకృష్ణ - నారా బ్రహ్మాణి - లోకేశ్ - నారా భువనేశ్వరికి సమానంగా త్వరలోనే దేవాన్ష్ ఆస్తులు ఉండేట్టు కనిపిస్తోంది. అమాయక బాలుడిని మీ ఆస్తుల ప్రకటనలకు పావుగా వాడుకోవడం తగదని, మీ లెక్కలన్నీ తప్పులతడకగా ప్రకటించడానికి ఆ బాలుడే దొరకాడా అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News