ఈ భారత ఆర్మీ ఉన్నతాధికారి మాటలు అంతా వినాల్సిందే..!
భారతదేశం ఎప్పుడూ ధర్మం వైపే నిలబడుతుంది.. ఈ దేశానికి అది తప్ప మరొకటి తెలియదు.. ఈ దేశం ఎప్పుడూ ధర్మబద్ధమైన మార్గంలో, ధర్మబద్ధమైన లక్ష్యంతోనే యుద్ధాలు చేస్తుంది.. అదే భారతదేశాన్ని కాపాడుతుంది!;
భారతదేశం ఎప్పుడూ ధర్మం వైపే నిలబడుతుంది.. ఈ దేశానికి అది తప్ప మరొకటి తెలియదు.. ఈ దేశం ఎప్పుడూ ధర్మబద్ధమైన మార్గంలో, ధర్మబద్ధమైన లక్ష్యంతోనే యుద్ధాలు చేస్తుంది.. అదే భారతదేశాన్ని కాపాడుతుంది! తాజాగా ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ చేసిన వ్యాఖ్యలు, పంచుకున్న పలు విషయాలు, గుర్తు చేసిన గతాలు ఆసక్తిగా మారాయి. వీటిని బంగ్లాదేశీయులతో పాటు భారతీయులు వినాలని అంటున్నారు!
అవును... గత కొన్ని రోజులుగా.. గతం మరిచిన పలువురు బంగ్లాదేశీయులు భారత్ వ్యతిరేక వాక్ చాతుర్యం పెంచుతున్నారు.. వారిని పాకిస్థాన్ ముప్పు తిప్పలు పెడుతున్నపుడు, వీరి విషయంలో ప్రపంచం మౌనంగా ఉన్నప్పుడు, వీరంతా దిక్కు తోచని స్థితిలో నిలుచుండిపోయినప్పుడు.. వీరిని ఆదుకుంది భారత్, వీరిని ఆదరించింది భారత్, వీరిని పాక్ చెర నుంచి విముక్తులను చేసింది భారత్! ఇది మరిచిన కొన్ని కుక్క మూతి పిందెలు లాంటి కొంతమంది భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు!
ఈ సందర్భంగా స్పందించిన మనోజ్ కుమార్ కటియార్... పాకిస్తాన్ సైనికులు వేలాది మంది బంగ్లాదేశ్ సోదరీమణులను వివస్త్రను చేస్తున్నప్పుడు భారతదేశం మౌనంగా ఉండి ఉండలేదని.. తాము జోక్యం చేసుకోవలసి వచ్చిందని.. అంటూ 1971 యుద్ధంలో ఇస్లామాబాద్ చేసిన దురాగతాలను గుర్తుచేసుకున్నారు. క్రూసేడ్లు, జిహాద్లతో నిండిన ఆధునిక చరిత్రలో భారతదేశం ఎల్లప్పుడూ ధర్మయుద్ధంతో పోరాడిందని.. ఈ భావన మన నాగరికత వలె పురాతనమైనదని అన్నారు.
ఈ సందర్భంగా 1948 నుంచి పాకిస్థాన్ తో భారత్ చేసిన అన్ని యుద్ధాలను ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే.. అత్యాచారం, హత్య, దోపిడీకి గురైన కశ్మీరీలను రక్షించింది ఈ ధర్మబద్ధ ఆలోచనతోనే అని.. ఆ ఏడాది దాడిచేసిన వారిలో వేషం వేసుకున్న పాక్ సైనికులే అధర్మవాదులని నొక్కి చెప్పారు. 1971 యుద్ధం భారత్ నమ్ముకున్న ధర్మానికి సరైన ఉదాహరణ అని మనోజ్ కుమార్ గుర్తు చేసుకున్నారు.
నాడు వేలాది మంది బంగ్లాదేశీయులు చంపబడ్డారు అని లెఫ్టినెంట్ జనరల్ కటియార్ తెలిపారు. దీన్ని జాతిహత్యగా అభివర్ణించిన ఆయన.. ఆ సమయంలో ప్రపంచం మొత్తం ప్రేక్షక పాత్ర వహించింది.. ఎవరూ దీనిపై స్పందించలేదు.. అయితే.. మన పరిసరాల్లో, మన పొరుగున ఇలాంటి అనాగరిక సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉండగలమా.. అలా ఉంటే మనం మన మనస్సాక్షికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని అన్నారు.
ఆ సమయంలో భారత్ మౌనంగా ఉండలేదు.. ధర్మాన్ని నిలబెట్టాలని భావించింది.. న్యాయ బద్ధంగా పోరాడింది.. తూర్పు పాకిస్థాన్ ను విముక్తి చేసే పరిపూర్ణ చర్యను పూర్తి చేసింది అని చెప్పిన ఆయన.. 1971లో తాము 93,000 మంది ఖైదీలను బంధించామని.. అప్పటికి శాంతి కోసం జరిగిన అన్వేషణను తాము మరువలేదని.. ఆ యుద్ధం ఒక న్యాయమైన కారణంతో ప్రారంభమై.. న్యాయమైన రీతిలో ముగిసిందని అన్నారు.
అయితే... ఇప్పుడు అదే పాకిస్థాన్ తో బంగ్లాదేశ్ స్నేహంగా ఉండటంతో దేశం కష్ట సమయాల్లో ఉందని చెప్పిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్.. మనం చరిత్ర నుంచి నేర్చుకోకపోతే, అదే పాఠాలు నేర్పుతూ, భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తుందని అన్నారు.