కూటమి గుడ్ న్యూస్... వారికి ముందే లక్ష్మీ కళ
కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విషయంలో ఎంతటి ప్రతిష్టగా తీసుకుందో అన్నది అమలును చూస్తే అర్ధం అవుతుంది.;
కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విషయంలో ఎంతటి ప్రతిష్టగా తీసుకుందో అన్నది అమలును చూస్తే అర్ధం అవుతుంది. గత ఏణ్ణర్థం కాలంగా ఏ ఒక్క రోజూ మిస్ కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనెక జిల్లాలకు వెళ్ళి మరీ పేదలకు స్వయంగా పెన్షన్ అందచేస్తున్నారు. అంతే కాదు ఏ రోజూ కూడా ఒకటో తేదీ తప్పింది లేదు, అంటే ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా చేతిలో నగదు ఠంచనుగా ప్రతీ సామాజిక పెన్షన్ లబ్దిదారుడికి దక్కుతోంది అన్నమాట. అదే విధానాన్ని 2026 లోనూ అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం మరింత నిబద్ధతో సిద్ధమైంది.
ఒక రోజు ముందే :
ఇక చూస్తే కనుక 2026 జనవరి 1న సెలవు దినంగా ఉంది. దాంతో సామాజిక పెన్షన్ దారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఒక రోజు ముందుగానే వారి చేతికి పెన్షన్ అందేలా ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసింది. దాంతో ఈ నెల 31నే ఏపీలో అందరికీ పెన్షన్ అందుతుంది అన్న మాట. ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియచేస్తూ పేదలు పెద్దలు ఇబ్బందులు పడకుండా తమ ప్రభుత్వం వారి పట్ల చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పారు. ఒకవేళ ఎవరైనా 31న పెన్షన్ తీసుకోకపోతే వారికి జనవరి 2న పెన్షన్ ఇస్తామని మంత్రి తెలిపారు.
లక్షలలో అందచేత :
ఇక ఎప్పటి మాదిరిగానే ప్రతీ ఒక్క లబ్దిదారుని ఇంటి వద్దకే సచివాలయం సిబ్బంది నేరుగా పింఛన్లు అందచేస్తారు అని మంత్రి వివరించారు. ఇక ఏపీలో చూస్తే మొత్తాం 63.12 లక్షల పింఛనుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా పెన్షన్ కింద ఒక్కొక్కరికీ నాలుగు వేల రూపాయలు వంతున అందచేస్తున్నారు. ఆ మొత్తం చూస్తే ప్రతీ నెలకు రెండు వేల 743.99 కోట్ల రూపాయలుగా అవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏడాదికి చూస్తే ఏకంగా 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. అయితే చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎంత కష్టమైనప్పటికీ ప్రతీ నెలా సామాజిక పెన్షన్లు అందరికీ అందేట్లుగా చూస్తున్నారు. ఈ విషయంలో ఆర్ధిక ఇబ్బందులు సైతం పక్కన పెట్టి పెన్షన్లు అందించేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు సామాజిక పెన్షన్లు అందచేయడం అంటే గ్రేట్ అని అంతా అంటున్నారు.