2025లో అందరి దృష్టిని ఆకర్షించిన వరల్డ్ టాప్ 10 బిల్లులు ఇవే!

మరికొన్ని రోజుల్లో 2025 ఏడాది ముగిసి, 2026 నూతన సంవత్సరంలోకి ఈ ప్రపంచం అడుగుపెట్టబోతుంది.;

Update: 2025-12-26 19:30 GMT

మరికొన్ని రోజుల్లో 2025 ఏడాది ముగిసి, 2026 నూతన సంవత్సరంలోకి ఈ ప్రపంచం అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఎన్నో బిల్లులు ఆమోదించబడగా... వాటిలో కొన్ని మాత్రం ఆ దేశంలోని ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు, నిరసనలను ఎదుర్కొన్నాయి. మరికొన్ని మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అవును.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు సంచలన బిల్లులు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ పరిపాలన తెచ్చిన బిల్లులతో పాటు భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇరాక్ మొదలైన దేశాల్లోని పలు బిల్లులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అవేమిటో ఇప్పుడు చూద్దామ్...!

అమెరికా 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'!:

ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. జూలైలో 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'పై సంతకం చేశారు. ఇది ప్రధానంగా ప్రతి ఏటా $2,17,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే కుటుంబాలకు పన్నులను తగ్గించడం.. సైనిక, సరిహద్దు భద్రతకు నిధులను పెంచడం.. సామాజిక కార్యక్రమాలను పునరుద్ధరించడంపై దృష్టి పెడుతుంది.

అయితే, ట్రంప్ చర్య 'పేదల నుండి దొంగిలించి అతి ధనవంతులకు ఇస్తుందని' డెమొక్రాట్లు విమర్శించారు. మరోవైపు.. ఈ బిల్లుపై విమర్శించిన తర్వాతే బిలియనీర్ ఎలోన్ మస్క్ - ట్రంప్‌ సంబంధం తెగిందని చెబుతారు.

ఎప్ స్టీన్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్!:

అమెరికా దేశ చరిత్రలో ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం ఎంత చర్చనీయాంశమైందనే విషయం అనేది తెలిసిందే. 2019లో అరెస్టు అయిన తర్వాత కస్టడీలో మరణించిన ఎప్ స్టీన్.. ఏళ్ల తరబడి ఉన్నత వర్గాలలోకి ప్రవేశించాడు. వందలాది మంది బాలికలను, యువతులను సెక్స్ కోసం అక్రమంగా రవాణా చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఇతడితో రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, ప్రముఖులు సంబంధాలు కలిగి ఉన్నారు!

ఈ నేపథ్యంలో నవంబర్‌ లో ఆమోదించబడిన ఎప్ స్టీన్ ఫైల్స్ పారదర్శకత చట్టం.. అపఖ్యాతి పాలైన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ స్టీన్ కు సంబంధించిన దాదాపు అన్ని ఫైళ్లను విడుదల చేయడానికి న్యాయశాఖకు 30 రోజుల సమయం ఇస్తుంది. దీని ప్రకారం.. డిసెంబర్ 19 నాటికి ఎప్ స్టీన్ లైంగిక అక్రమ రవాణా సామ్రాజ్యం గురించి తన విస్తారమైన రికార్డులను న్యాయశాఖ విడుదల చేయాలి.

భారత్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు!:

డబ్బుతో ఆడే ఆన్‌ లైన్ గేమ్‌ ల నిర్వహణ, ప్రకటనలను నిషేధించే 'ఆన్‌ లైన్ గేమింగ్ ప్రమోషన్ & నియంత్రణ బిల్లు'ను ఆగస్టులో భారత పార్లమెంటు ఆమోదించింది. అతిక్రమిస్తే.. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు/లేదా రూ. 1 కోటి వరకు జరిమానా విధించేలా ఈ చట్టం రూపొందించబడింది. ఇక, పదే పదే నేరాలు చేస్తే మూడు నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2 కోట్ల వరకు జరిమానాలు విధించబడతాయి.

భారత్.. 'రైట్ టు డిస్ కనెక్ట్ బిల్లు - 2025'!:

ఈ నెలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ, సుప్రియా సులే లోక్‌ సభలో 'రైట్ టు డిస్‌ కనెక్ట్ బిల్లు - 2025'ను ప్రవేశపెట్టారు. ఇది ప్రతి ఉద్యోగికి పని గంటలకు మించి, సెలవు దినాల్లో పని సంబంధిత టెలిఫోన్ కాల్స్, ఇ-మెయిల్‌ ల నుండి డిస్‌ కనెక్ట్ అయ్యే హక్కును కల్పించడానికి ఉద్యోగుల సంక్షేమ అధికారాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుంది.

ఈ బిల్లు ప్రకారం.. ఫోన్ కాల్స్, టెక్ట్స్, ఈ-మెయిల్స్, వీడియో కాల్స్ వంటి అన్ని రకాల కమ్యూనికేషన్లకు స్పందించడానికి నిరాకరించినందుకు ఏ ఉద్యోగిపైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదు. ఈ హక్కును ఉల్లంఘించే సంస్థలకు మొత్తం ఉద్యోగి వేతనంలో 1 శాతం జరిమానా విధించాలని ప్రతిపాదన సూచిస్తుంది.

భారత్ లో అరెస్టు అయిన మంత్రులను తొలగించే బిల్లు!:

తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు చేయబడిన లేదా నిర్బంధించబడిన ఎన్నికైన ప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా చూసే బిల్లును ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు.. రాజ్యాంగం ప్రకారం.. దోషులుగా తేలిన ప్రజా ప్రతినిధులను మాత్రమే పదవుల నుండి తొలగించే అవకాశం ఉంది.

అయితే.. ప్రతిపాదిత చట్టం ప్రకారం.. ప్రధానమంత్రి, ఏదైనా కేంద్ర మంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, మంత్రులు అరెస్టు చేయబడి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంచబడితే, వారు 31వ తేదీలోపు రాజీనామా చేయాలి లేదా ఆటోమెటిక్ గా తొలగించబడతారు. దోషిగా నిరూపించబడే వరకు ఒక వ్యక్తి నిర్దోషి అనే చట్టం యొక్క ప్రాథమిక సూత్రాన్ని ఈ బిల్లులు ఉల్లంఘిస్తున్నాయని పలువురు నాయకులు వాదించారు!

భారత్.. వక్ఫ్ సవరణ చట్టం!:

1995 వక్ఫ్ చట్టానికి చేసిన సవరణలు పార్లమెంటు ఆమోదించింది. ఈ సవరణలు ఈ ఏడాది ఏప్రిల్‌ లో రాష్ట్రపతి ఆమోదాన్ని పొందాయి. అయితే దీనిపై దేశవ్యాప్తంగా భారీ నిరసనలు చెలరేగాయి. అందుకు కారణం.. కొత్త వక్ఫ్ చట్టం ప్రస్తుత వ్యవస్థలో గణనీయమైన మార్పులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోవడమే అని అంటారు.

దీని ప్రకారం... కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాంను ఆచరిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్ ప్రకటించవచ్చు.. ఆస్తిని వక్ఫ్‌ గా ప్రకటించే వ్యక్తి ఆ సమయంలో దానిని కలిగి ఉండాలి.. వక్ఫ్ ప్రకటన మహిళా వారసులతో సహా దాత వారసుడి వారసత్వ హక్కులను తిరస్కరించకూడదు.. ఆస్తి వక్ఫ్ కాదా అని విచారించి నిర్ణయించే వక్ఫ్ బోర్డు అధికారాన్ని తొలగిస్తుంది.

1995 వక్ఫ్ చట్టం ప్రకారం కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలుగా ఉండాలి, కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. అయితే.. కొత్త చట్టం ప్రకారం ఇద్దరు సభ్యులు ముస్లిమేతరులు, ఇద్దరు ముస్లిం సభ్యులు మహిళలు అయి ఉండాలి.

అయితే.. సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ లో 'వక్ఫ్ (సవరణ) చట్టం - 2025'లోని అనేక కీలక నిబంధనలను నిలిపివేసింది. గత ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను ఆచరిస్తున్న వారు మాత్రమే ఆస్తిని వక్ఫ్‌ గా అంకితం చేయగలరనే నిబంధనతో సహా, మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి నిరాకరించింది.

భారత్.. జి రామ్ జి బిల్!:

2005లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వం అమలు చేసిన 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎం.ఎన్‌.ఆర్‌.ఈ.జీ.ఏ) స్థానంలో వచ్చిన ఈ కొత్త బిల్లు 'గ్యారంటీ ఫర్ రోజ్‌ గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు' లేదా 'జి రామ్ జి బిల్లు' ఈ నెలలో పార్లమెంటులో ఆమోదం పొందింది. ఇందులో ప్రధానంగా పేరు మార్పుపై తీవ్ర విమర్శలు, నిరసనలు వచ్చాయి!

పాకిస్థాన్.. 27వ రాజ్యాంగ సవరణ బిల్లు!:

పాకిస్థాన్ లో అత్యంత వివాదాస్పదమైన బిల్లు ఈ ఏడాదిలో ఆమోదించబడింది. ఇందులో భాగంగా.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ గత నెలలో 27వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. ఈ 27వ సవరణ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పాత్ర కింద సైనిక శక్తిని ఏకీకృతం చేస్తుంది.. ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టును ఏర్పాటు చేస్తుంది.

ఈ మార్పులు ఈ సంవత్సరం ప్రారంభంలో ఫీల్డ్ మార్షల్‌ గా పదోన్నతి పొందిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ కు.. సైన్యం, వైమానిక దళం. నావికాదళంపై కమాండ్‌ గా ఉండటానికి వీలు కల్పిస్తాయి. దీనిపై స్పందించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు బిల్లు ప్రతులను చింపివేసాయి. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చరమగీతం పాడుతోందని ఆరోపించాయి.

ఇరాక్.. వ్యక్తిగత హోదా చట్ట సవరణ!:

ఈ ఏడాది జనవరిలో ఇరాకీ పార్లమెంట్ 1959 వ్యక్తిగత హోదా చట్టాన్ని సవరించింది. తద్వారా వివాహం, వారసత్వం, విడాకులు, పిల్లల కస్టడీ వంటి కుటుంబ విషయాల కోసం ప్రజలు మతపరమైన లేదా పౌర నిబంధనలలో దేనినైనా ఎంచుకునే అవకాశం లభించింది. ఈ సవరణ ప్రకారం.. షియా ఎండోమెంట్ కార్యాలయం వ్యక్తిగత స్థితి విషయాలపై జాఫారీ (షియా) రూలింగ్స్ కోడ్ ను ఏర్పాటు చేయగా.. దీన్ని పార్లమెంట్ ఆమోదించింది.

దీని ప్రకారం... భర్తలు తమ భార్యలకు తెలియజేయకుండా లేదా వారి సమ్మతిని తీసుకోకుండానే విడాకులు తీసుకోవడానికి అనుమతిస్తుంది.. ఏడు సంవత్సరాల తర్వాత పిల్లల బాధ్యత, సంరక్షణను తండ్రికి ఆటోమెటిక్ గా బదిలీ చేస్తుంది!

ఆస్ట్రేలియా సోషల్ మీడియా బిల్లు!:

16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. గత సంవత్సరం ఆమోదించబడిన చట్టం ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌ లు డిసెంబర్ 10 నుండి 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులను తొలగించాలి. అలా కానిపక్షంలో.. 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు వరకు జరిమానా విధించాలని ఆదేశించింది.

Tags:    

Similar News