16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. భారత్ లో కీలక పరిణామం!
గత కొంత కాలంగా.. 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేదం అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.;
గత కొంత కాలంగా.. 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేదం అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి చాలా మంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల బాగుంటుందని.. వారి ఆలోచనలు ఫ్రెష్ గా క్రియేటివ్ గా ఉంటాయని.. వారి మెదడులపై ఇతరుల ప్రభావం తక్కువగా ఉంటుందని అంటుంటారు.
అలా కానిపక్షంలో పిల్లల స్క్రీన్ టైం పెరిగి వారి శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుందని.. పైగా ఆ పోస్టుల్లో కనిపించే ఇతరుల లైఫ్ స్టైల్, వీరిపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని వ్ధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ క్రమంలో భారత్ లోనూ ఈ చర్చ తాజాగా ఆసక్తిగా మారింది.
అవును... ఆస్ట్రేలియాలో ఆమోదించబడిన చట్టం ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులను తొలగించాలి. అలా కానిపక్షంలో.. 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు వరకు జరిమానా విధించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో.. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్ లోని ఓ ఉన్నత న్యాయస్థానం ఆసక్తికరంగా స్పందించింది.
ఇటీవల ఎస్ విజయ్ కుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ లో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందులో... ఇంటర్నెట్ లో యథేచ్ఛగా అశ్లీల చిత్రాలు లభిస్తున్నాయని.. వీటిని ఎవరైనా చూసే వీలుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇలా ఎవరుపడితే వాళ్లు అశ్లీల చిత్రాలు, ఫోటోలు చూడకుండా సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.
ఈ పిల్ పై స్పందించిన జస్టిస్ జి జయచంద్రన్, జస్టిక్ కేకే రామకృష్ణన్ తో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా... పోర్నోగ్రఫీ కంటెంట్ చూడకుండా ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇదే సమయంలో.. ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధం అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.
ఇలా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. భారత్ లోనూ ఆస్ట్రేలియా తరహాలో ఈ విషయంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. అదే జరిగితే సమాజానికి, చిన్నారుల భవిష్యత్తుకు అది ఎంతో మేలు చేస్తుందనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి!