'అమెరికాలో భారతీయులందరినీ బహిష్కరించండి'.. ఎందుకంటే..!

డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అమెరికాలో వలస వ్యతిరేక వాక్చాతుర్యం, ముఖ్యంగా భారత సంతతికి చెందిన వారిపై తీవ్రమైందని చెప్పొచ్చు.;

Update: 2025-12-27 03:41 GMT

డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అమెరికాలో వలస వ్యతిరేక వాక్చాతుర్యం, ముఖ్యంగా భారత సంతతికి చెందిన వారిపై తీవ్రమైందని చెప్పొచ్చు. ట్రంప్ 2.0లో ఈ మేరకు తీసుకుంటున్న పలు నిర్ణయాలు లక్షలాది మంది విదేశీయులను.. ప్రధానంగా భారతీయులను తీవ్రంగా ప్రభావింతం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయులందరినీ బహిష్కరించాలంటూ అమెరికా జర్నలిస్టు పెట్టిన పోస్టు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.

అవును... అపార ప్రతిభ గల భారతీయులను నియమించుకొని కొన్నేళ్లుగా అమెరికా చాలా ప్రయోజనాలు పొందిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంటే.. భారతీయులు అమెరికాకు వెళ్లడం వల్ల ఇరు దేశాలకూ బెనిఫిట్ మ్యూచువల్ గా ఉందన్నమాటేగా! ఈ విషయం మరిచిన కొంతమంది మాత్రం.. అమెరికాలో ఉన్న భారతీయులపై తమ అక్కసు వెళ్లగక్కుతుంటారు. సక్రమ వలసపైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా అమెరికన్ జర్నలిస్టు, మితవాద కార్యకర్త మాట్ ఫోర్నీ.. అమెరికాలోని భారత సంతతికి చెందిన వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా... 2026లో సమాజంలోని సభ్యులను, హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే.. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వారందరినీ దేశం నుంచి బహిష్కరించాలని మాట్ ఫోర్నీ పేర్కొన్నారు.

తాజాగా తన సోషల్ మీడియా పోస్టులో... అమెరికాలో భారతీయుల పట్ల ద్వేషం నూతన సంవత్సరంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని.. భారత సంతతి ప్రజల ఇళ్లు, వ్యాపారాలు, దేవాలయాలపై విస్తృత దాడులు, హింసకు గురవుతాయని ఆయన పేర్కొన్నారు. పైగా... వారి ప్రాణాలను కాపాడటానికి, దేశంలో సామరస్యాన్ని పెంపొందించడానికి వారందరినీ భారత్ కు తిరిగి పంపించాలని.. ప్రతీ భారతీయుడిని బహిష్కరించాలని ఆయన సూచించారు.

అలా అని అమెరికాలో భారతీయులు, భారత సంతతి ప్రజలపై ఈ దాడులు శ్వేతజాతీయులు చేయరని.. హిస్పానిక్స్, ఆఫ్రికన్-అమెరికన్లు, పాకిస్థాన్ సంతతికి చెందిన వ్యక్తులు చేస్తారని.. ప్రతి భారతీయుడిని బహిష్కరించడమే దీనికి ఏకైన పరిష్కారమని ఫోర్నీ సూచించారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఈ క్రమంలో.. వెంటనే తన పోస్టును డిలీట్ చేశారు.

కాగా... అమెరికన్ కాలమిస్టు, రచయిత, జర్నలిస్టు అయిన మాట్ ఫోర్నీ.. సోషల్ మీడియా వేదికగా భారతీయులపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం.. వారిని బహిష్కరించాలని పిలుపునివ్వడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ఆయన్ను ఇటీవల అమెరికన్ మీడియా సంస్థ ‘ది బ్లేజ్’ నుంచి తొలగించారు. ఇటీవల ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్.. ఈఎస్టీవై కి సీఈఓగా భారతీయ-అమెరికన్ కృతి పటేల్ నియమితులైనప్పుడూ ఇలానే వ్యాఖ్యానించాడు.

ఇందులో భాగంగా... మరో అసమర్థ భారతీయుడు ఒక అమెరికన్ కంపెనీని స్వాధీనం చేసుకున్నారు.. ఆమె మొదటి అడుగు ప్రతి అమెరికన్‌ ను తొలగించి వారి స్థానంలో భారతీయులతో భర్తీ చేయడం అని నేను హామీ ఇస్తున్నాను.. ప్రతి భారతీయుడిని బహిష్కరించండి అని ఈ సందర్భంగా ఫోర్నీ వ్యాఖ్యానించారు. ఈ స్థాయిలో అమెరికాలోని భారతీయులపై అతడు అక్కసు వెళ్లగక్కుతుంటాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా పోస్టు పెట్టి, డిలీట్ చేశారు.

Tags:    

Similar News