రాధా...రాజ్యసభ పిలుస్తోంది !
వంగవీటి రాధాకృష్ణ అలియాస్ రాధా. రంగాకు అసలైన వారసుడు. రాజకీయంగా ఆయన అనుకున్న స్థాయిలో మాత్రం రాణించలేక పోతున్నారు.;
వంగవీటి రాధాకృష్ణ అలియాస్ రాధా. రంగాకు అసలైన వారసుడు. రాజకీయంగా ఆయన అనుకున్న స్థాయిలో మాత్రం రాణించలేక పోతున్నారు. తండ్రి దివంగంతులై నాలుగు దశాబ్దాల కాలం గడచింది. కానీ రంగా అంటే ఒక రకమైన వైబ్రేషన్. కాపులకు ఆయన ఆరాధ్యనీయుడు. ఇక రాధా తండ్రి అడుగు జాడలలో 2004లో కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఒకసారి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాతనే ఆయనకు రాజకీయ కష్టాలు మొదలయ్యాయి. ఆయన 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా ఓటమి వరించింది. 2019లో టికెట్ దక్కలేదు, 2024లో అదే సీన్ కనిపించింది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన రాధా అక్కడే ఉంటున్నారు. పార్టీలు తరచూ మారుతున్నారు అన్న విమర్శలకు చెక్ పెడుతూ టీడీపీలో ఆయన నిబద్ధత కలిగిన నాయకుడిగా నిలిచి ఉన్నారు.
పదవులు దక్కలేదు :
ఇక రాధాకి పదవులు అయితే ఏవీ దక్కలేదు, ఎమ్మెల్సీగా ఆయనకు పదవి దక్కుతుందని ఆ మీదట మంత్రి కూడా అవుతారని ఆయన అభిమానులు అనుచరులు అనుకున్నా ఆచరణలో అయితే అలాంటివి ఏవీ జరగలేదు, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అయిదు ఎమ్మెల్సీలు నాలుగు రాజ్యసభ ఖాళీలను భర్తీ చేసినా రాధాకు ఎందుకో పిలుపు అయితే రాలేదు. దాంతో ఆయన సైతం గమ్మున్న ఉన్నారు వచ్చిన రోజునే వస్తుంది అని కూడా ఒకింత రాజకీయ వైరాగ్యం కూడా ఆయన ప్రదర్శిస్తున్నారు.
మారిన రాజకీయంతో :
అయితే మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఇపుడు కూటమి పెద్దలు రాధాను తలచుకుంటున్నారు అని అంటున్నారు. ఈ మధ్యనే మాజీ మంత్రి అంబటి రాంబాబు ని అరెస్ట్ చేసిన తరువాత కాపులను టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అని వైసీపీ విమర్శిస్తోంది. దాంతో పాటుగా కాపులలో మెల్లగా అసంతృప్తి మొదలైంది అన్న ప్రచారం సాగుతోంది. నిజానికి జరిగిన సంఘటనలు వేరు అయినా వాటికి సామాజిక కోణాన్ని ముడి పెట్టి వ్యూహాత్మకంగా వైసీపీ ముందుకు తీసుకుని వెళ్తోంది. ఈ క్రమంలో వంగవీటి రాధా విషయం ఇపుడు కూటమిలో పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది అని అంటున్నారు.
ఆయనకు ఒకటి అంటూ :
ఈ ఏడాది జూన్ లో రాజ్యసభ ఖాళీలు నాలుగు అవుతున్నాయి. అందులో రెండు టీడీపీకి దక్కుతాయి. ఒకటి సానా సతీష్ ని రెన్యూవల్ చేయడానికి సరిపోతుంది, రెండవ సీటు విషయంలో అయితే పోటీ హెవీగా ఉంది. అయితే నిన్నటి దాకా అనేక రకమైన సమీకరణలు పేర్లూ వినిపించాయి, కానీ మారిన రాజకీయంతో ఇపుడు వంగవీటి రాధా పేరు గట్టిగా వినిపిస్తోంది అని అంటున్నారు. కాపులను అణగదొక్కుతున్నారు అని వైసీపీ చేస్తున్న విమర్శలకు మాటలతో కాదు, చేతలతోనే చెక్ చెప్పాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలో వంగవీటి రాధాకు రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.
భారీ గిఫ్ట్ గానే :
అదే జరిగితే రాధాకు భారీ గిఫ్ట్ దొరికినట్లే అని అంటున్నారు. పాతికేళ్ళ రాజకీయ జీవితంలో ఒకే ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అయిన రాధాకు ఆరేళ్ళ పదవీ కాలం కలిగిన రాజ్యసభ సీటు దక్కడం అంటే గ్రేట్ అనే అంటున్నారు. దాంతో ఈ వార్త అయితే ఇపుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మరి ఈ ప్రచారం కనుక నిజం అయితే కూటమికి వంగవీటి బలం మరింతగా తోడు అవుతుందని తిరుగులేని విధంగా అది ముందుకు సాగే చాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.