ఏపీలో లెక్క తేల్చిన చంద్రబాబు

Update: 2018-11-30 06:03 GMT
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బద్ధ శత్రువు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ బంధాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో రెండు రోజుల పాటు తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల్లో కూడా కలిసే ప్రయాణించాలని కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తుందనే ఆశను చూపించి వారితో కలిసి నడుద్దామంటూ తెలుగుదేశం నాయకులు చెప్పినట్లు చెబుతున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయానికి పార్టీ పరిస్థితిని బట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలని కూడా చంద్రబాబు నాయుడు స్థూలంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు.

ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు చెప్పినట్లు సమాచారం. ఈ సమాచారం మేరకే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శ్రీకాకుళంలో జరిగిన పార్టీ సమావేశంలో తన లాంటి వారికి తప్ప మిగిలిన వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాదని - కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటి నుంచే త్యాగాలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పేరుతో తెలుగుదేశం పార్టీలో కొందరు సీనియర్లకు ఉద్వాసన పలకాలని - దీని ద్వారా భవిష్యత్ లో తన కుమారుడు నారా లోకేష్ కు సీనియర్ నాయకుల నుంచి తలనొప్పులు రాకుండా చూడాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. రాయలసీమలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా సంప్రదాయ ఓటర్లు ఉన్నారని - అలాగే ఉత్తరాంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి ఉన్నదని చంద్రబాబు నాయుడు అంచనా వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖరారైతే రాయలసీమ - ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు.

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నామని ప్రచారం మరింత చేయాలని - దీని వల్ల ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రాదనేది చంద్రబాబు నాయుడి ఉద్దేశ్యంగా తెలుస్తోంది. తాను ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ లో తనకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఆలోచన చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఓట‌మి భ‌యం వ‌ల్లే కేంద్రంలో జాగ్ర‌త్త ప‌డే ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య స్నేహాన్ని మరింత గట్టి పరిచేందుకు తెలంగాణ కాంగ్రెప్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఉపయోగించుకోవాలన్నది చంద్రబాబు నాయుడి ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ఇటీవల కాంగ్రస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో  రేవంత్ రెడ్డి మరింత సఖ్యంగా ఉంటున్నారు. దీన్ని కూడా తన అవసరాలకు వాడుకోవాలన్నది చంద్రబాబు నాయుడి ఉద్దేశ్యంగా తెలుస్తోంది.


Tags:    

Similar News