ఏపీలో ఉద్య‌మాల‌కు చంద్ర‌బాబు మార్కు చెక్‌!

Update: 2016-10-02 04:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప్ర‌త్యేక హోదా విష‌య‌మై కొన్ని నిర‌స‌న‌లు ఉన్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా కూడా ప్ర‌త్యేక హోదా సాధ‌న అంటూ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అయితే, కేంద్రం ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీతోనే చంద్ర‌బాబు స‌ర్కారు సంతృప్తి చెందింది. ఈ నేప‌థ్యంలో హోదా కంటే ప్యాకేజీ గొప్ప‌ది అనేది ప్ర‌జ‌ల్లోకి భారీ ఎత్తున తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. కిం క‌ర్త‌వ్యం ఏంటంటే... ప్ర‌త్యేక హోదా పేరుతో ఏపీలో ఉన్న ఉద్య‌మాల‌ను అణ‌చివేయ‌డం! సూటిగా చెప్పాలంటే జ‌గ‌న్ చేప‌డుతున్న ఉద్య‌మానికి చెక్ పెట్ట‌డం.

భూసేక‌ర‌ణ విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కారుపై చాలా విమ‌ర్శ‌లే ఉన్నాయి. రైతుల భూముల్ని స‌ర్కారు అడ్డ‌గోలుగా లాక్కుంటోంద‌న్న విమ‌ర్శ‌లు గ‌తంలో చాలా వినిపించాయి. అమ‌రావ‌తి భూసేక‌ర‌ణ విష‌యంలో ఏ స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైందో చంద్ర‌బాబుకు అనుభ‌వ‌మే. అయితే, త్వ‌ర‌లోనే జాతీయ ర‌హ‌దారుల ప‌నుల కోసం దాదాపు 50 వేల ఎక‌రాల‌ను సేక‌రించాల్సి ఉంది. కాబ‌ట్టి, కాస్త ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించి ఆందోళ‌న‌లు రాకుండా ఉండేందుకు కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు ఉద్య‌మించినా ఆందోళ‌న చేప‌ట్టినా వారిపై పీడీ యాక్ట్ ప్ర‌యోగించాల్సిందా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశించారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కూ ఎస్పీల‌కూ ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జార చేశారు.

ప్ర‌త్యేక హోదా పేరుతో సాగుతున్న ఉద్య‌మాల‌పై కూడా ఈ చ‌ట్టాన్ని ప్ర‌యోగించ‌మ‌ని చెప్పార‌ట! అంతేకాదు, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాల్లో విద్యార్థుల‌ను పాల్గొన‌కుండా చూడాల్సిన బాధ్య‌త అధికారుల‌పై ఉంద‌ని చెప్పారు. వారికి ఏదో విధంగా న‌చ్చ‌చెప్పాల‌న్నారు. ఆందోళ‌నకారుల‌పై కేసులు పెట్ట‌డ‌మే కాకుండా వాటిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించార‌ట‌! అలా అయితేనే ప్ర‌భుత్వ కార్యక్ర‌మాల‌కు అడ్డు వెళ్తే ఏం జ‌రుగుతుందో అనే విష‌యం అంద‌రికీ అర్థ‌మౌతుంద‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం.

ఈ ఆదేశాల వెన‌క చంద్ర‌బాబు నాయుడు వ్యూహం ఏంటో స్ప‌ష్టంగానే తెలుస్తోంది. వైకాపా చేప‌డుతున్న ప్ర‌త్యేక హోదా ఉద్యమాన్ని అణ‌చివేయ‌డ‌మే తాజా ఆదేశాల ఉద్దేశ‌మ‌ని భావించాలి. ప్ర‌త్యేక హోదాపై ఆంధ్రుల‌కు ఇంకా ఆశ‌లున్నాయి. ఆ ఆశ‌లకు వైకాపా అద్దం ప‌డుతోంది. ఒక‌వేళ నిజంగానే ప్ర‌జ‌ల్లో ఆ డిమాండ్ లేక‌పోతే జ‌గ‌న్ చేప‌డుతున్న యువ‌భేరికిగానీ, ఇత‌ర నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కుగానీ ప్ర‌జ‌లు ఎందుకు వ‌స్తారు..? అయినా, ప్ర‌భుత్వ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌పై నిర‌స‌న తెలిపినంత మాత్రాన పీడీ యాక్ట్ ప్ర‌కారం కేసులు పెడ‌తామ‌న‌డం మ‌రీ దారుణం! ఎందుకంటే, వ్య‌భిచారం - గూండాగిరీ - డ్ర‌గ్స్ ర‌వాణా వంటి వాటిలో ప‌ట్టుబ‌డ్డ‌వారిపై ఈ యాక్ట్‌ను ప్ర‌యోగిస్తారు. దాన్ని ఆందోళ‌నకారుల‌కు వ‌ర్తింప‌జేయ‌డం స‌రైంది కాద‌నే అభిప్రాయం కొన్ని వ‌ర్గాల నుంచి వ్య‌క్తం అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News