బాబు నోటా... విశ్వ‌స‌నీయ‌త మాట వినిపించిందే!

Update: 2017-08-14 11:00 GMT
తెలుగు నేల రాజ‌కీయాల్లో ఒక్కో రాజ‌కీయ నేత‌ది ఒక్కో స్టైల్. ఇందులో ఏమాత్రం డౌట్ లేద‌నే చెప్పాలి. వ‌స్త్ర‌ధార‌ణ, దిన‌చ‌ర్య, మాట తీరు, ప‌ల‌క‌రింపు, క‌లుపుగోలు త‌నం... త‌దిత‌రాల విష‌యంలో ఏ ఒక్క నేత కూడా మ‌రో నేత‌లా క‌నిపించ‌రు. ఇది మ‌న తెలుగు నేల‌లో ఎన్నో ఏళ్లుగా కొన‌సాగుతూ వ‌స్తున్న అంశం. నిలువెత్తు రాజ‌సానిని నిలువుట‌ద్దంలా టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్డీఆర్ నిల‌బ‌డితే...అచ్చమైన పంచెకట్టుకు దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి కేరాఫ్ అడ్రెస్‌ గా నిలిచారు. వారిద్ద‌రూ గ‌తం అనుకుంటే... న‌వ్యాంధ్ర‌లో ఇప్పుడు కీల‌క నేతలుగా ఉన్న టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు - వైసీపీ అదినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల గురించే చెప్పుకోవాలి. ఇద్ద‌రు నేత‌లు పంచెల‌ను వ‌దిలేసి ప్యాంట్ల‌లోకి ఎప్పుడో మారిపోయారు. యంగ్ త‌రంగ్ గా క‌నిపిస్తున్న జ‌గ‌న్ విష‌యాన్ని కాస్తంత ప‌క్క‌న‌బెడితే... వైఎస్ స‌మ‌కాలీకుడిగా పేరున్న చంద్ర‌బాబు పంచెక‌ట్టులో అరుదుగా మాత్ర‌మే క‌నిపిస్తారు.

ఇక మాట తీరును తీసుకుంటే... చంద్ర‌బాబు స్టైల్ లో ఇప్ప‌టిదాకా మార్పు వ‌చ్చిన దాఖ‌లాలే క‌నిపించ‌డం లేదు. 70వ ద‌శ‌కంలో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన స‌మ‌యంలో ఆయ‌న మాట తీరు ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉంద‌నే చెప్పాలి. దాదాపుగా జ‌గ‌న్ మాట తీరు కూడా పెద్ద‌గా మారిందేమీ లేద‌న్న వాద‌నే వినిపిస్తోంది. త‌న తండ్రి రెండో ప‌ర్యాయం సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్టాక‌... తొలి సారి ఎంపీగా గెలిచిన జ‌గ‌న్‌... చంద్ర‌బాబుతో పోలిస్తే చాలా జూనియ‌ర్ కిందే లెక్క‌. ఇదంతా స‌రే.. అన్నీ పాత విష‌యాలే చెబుతూ... కొత్త వార్త చెబుతున్న ఫీలింగ్ ఎందుకు ఇస్తున్నార‌నేదేగా మీ ప్ర‌శ్న‌. అయితే అస‌లు విష‌యంలోకి వ‌చ్చేద్దాం. రాజ‌కీయాల్లో విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త అన్న ప‌దాలు వైఎస్, ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ నుంచి మాత్ర‌మే వినిపించేవి. ఈ రెండు ప‌దాలు చంద్ర‌బాబు నోట వినిపించిన దాఖ‌లా మ‌న‌కు క‌నిపించ‌దు. ఒక‌వేళ ఎప్పుడైనా వినిపించినా కూడా.. ఏదో అదాటుగా ఆ ప‌దం ఆయ‌న నోట వినిపించిందేమో గానీ... ఆ ప‌దానికి అర్థం చెబుతూ చంద్ర‌బాబు ఆ ప‌దాన్ని ప‌లికిన సంద‌ర్భం ఇప్ప‌టిదాకా లేద‌నే చెప్పాలి.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ ఇదే అంశాన్ని ప్ర‌ధానాస్త్రంగా తీసుకుని చంద్రబాబు అండ్ కోపై నిప్పులు చెరుగుతున్నారు. ఒక‌సారి మాట ఇస్తే... మాట త‌ప్ప‌మ‌ని, అందుకే త‌మ‌ది మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని వంశమ‌ని జ‌గ‌న్ చెబుతున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు ఈ విశ్వ‌స‌నీయ‌త అన్న మాట చంద్ర‌బాబు నోట నుంచి కూడా కాస్తంత స్ప‌ష్టంగానే వినిపించింద‌ని చెప్పాలి. నేటి ఉద‌యం విజ‌య‌వాడ‌లో టీడీపీ స‌ర్కారు నిర్వ‌హించిన కాపుల ఆత్మీయ స‌భ‌లో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను త‌మ‌కు ఏ ఒక్క‌రు గుర్తు చేయాల్సిన అవ‌సరం లేద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌ల‌కు తామిచ్చిన హామీల‌న్నీ త‌మ‌కు గుర్తున్నాయ‌ని, వాటిలో చాలా వాటిని నెర‌వేర్చామ‌ని, మిగిలిన వాటిని కూడా త్వర‌లోనే నెర‌వేరుస్తామ‌ని కూడా చంద్ర‌బాబు చెప్పారు.

ఈ సంద‌ర్భంగానే చంద్ర‌బాబు నోట విశ్వ‌స‌నీయ‌త అనే మాట వినిపించింది. అదేదో ఆ ప‌దాన్ని ఆయ‌న ఊరికే ప‌ల‌క‌లేదు. దాని అర్ధాన్ని వివ‌రించి మ‌రీ... ఆ విశ్వ‌స‌నీయ‌త త‌మ‌లో కూడా ఉంద‌ని కూడా చెప్పుకొచ్చారు. అయినా ఈ ప‌దానికి సంబంధించి చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే...  *ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి సమాజం కోసం ఏదైనా చేస్తేనే ప్రజల్లో విశ్వసనీయత వస్తుందని, తాను ఇచ్చిన హామీలను ఎవరూ గుర్తుచేయాల్సిన అవసరం లేదని, తన బాధ్యతలను తానే పూర్తిచేస్తా*నని చంద్ర‌బాబు తెలిపారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చి తీర‌తామ‌న్న విష‌యాన్ని మ‌రోమారు పున‌రుద్ఘాటిస్తున్న సంద‌ర్భంగానే చంద్ర‌బాబు ఈ ప‌దాన్ని వినియోగించారు.
Tags:    

Similar News