ఏపీ పన్ను రాబడిలో కొత్త రికార్డు.. 9 నెలల్లో రూ.లక్ష కోట్లు దాటేశారు
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పన్ను రాబడి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.;
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పన్ను రాబడి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం తొమ్మిది నెలల కాలానికి పన్ను రాబడి ఆదాయం రూ.లక్ష కోట్ల మార్కును దాటేయటం విశేషం. 2021 నుంచి ఇప్పటివరకు తొమ్మిది నెలల వ్యవధిలో రూ.లక్ష కోట్ల కాస్త దగ్గరగా వచ్చినప్పటికి.. ఈసారి మాత్రం ఏకంగా ఆ మార్కును దాటేసి.. ఆసక్తికర గణాంకాలు నమోదైన పరిస్థితి. ఏపీలో మారుతున్న ముఖచిత్రానికి ఇదో నిదర్శనంగా చెబుతున్నారు. ఈ స్థాయిలో పన్ను రాబడిని సాధించింది గతంలో ఎప్పుడూ లేదు.
రాష్ట్ర పన్నుల రాబడిలో జీఎస్టీ.. స్టాంపుల రిజిస్ట్రేషన్ల ఫీజుతో పాటు భూమిశిస్తు.. అమ్మకపు పన్ను.. ఎక్సైజ్ సుంకం.. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా.. ఇతర పన్నులన్నీ కలిపితే రాష్ట్ర రాబడి వస్తుంది. ఏపీలో పరిస్థితులు మారుతున్నాయని.. డెవలప్ మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తుందన్న మాటకు బలం చేకూరేలా తాజా గణాంకాల ఉన్నట్లుగా చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025 ఏప్రిల్ 01 - 2026 మార్చి 31లో మొత్తం పన్నుల రాబడి రూ1.66 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇందులో 63.23 శాతం డిసెంబరు నాటికి సమకూరిన నేపథ్యంలో మిగిలిన 37 శాతం (సుమారు) మూడు నెలల్లో సమకూరుతుందా? అన్నదిప్పుడు ప్రశ్న.
అయితే.. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన లావాదేవీలు.. కొనుగోళ్లు.. ఏపీకి భారీ ఆదాయాన్ని తెచ్చి పెడతాయన్న అంచనా వ్యక్తమవుతోంది. ఆదాయం పెరగటానికి కారణాల్లో ఒకటి మూలధన వ్యయం ఎంత ఎక్కువగా ఉంటే.. డెవలప్ మెంట్ అంత సాధ్యమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన తొమ్మిదినెలల్లో రూ.19,224 కోట్ల మూలధన వ్యయం చేశారు. గడిచిన ఐదేళ్లలో ఇదే ఎక్కువగా చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.40వేల కోట్లు ఖర్చు చేయాలని భావించినా.. తొమ్మిదినెలల్లో యాభై శాతమే ఖర్చు చేసిన పరిస్థితి. మిగిలిన మూడు నెలల్లో యాభై శాతం ఖర్చు చేయటం సాధ్యమా? అన్నది ప్రశ్న. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. 2024 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.8,894 కోట్లు మాత్రమే. అందుకు భిన్నంగా ఈ ఏడాది భారీగా ఖర్చు చేసిన దానికి తగిన ఫలితం లభించినట్లుగా చెప్పాలి.