మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణిని మోసం చేసిన సైబర్ దొంగల్ని పట్టేశారు

కొద్దిరోజుల క్రితం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణిని సైబర్ నేరస్తులు స్టాక్ మార్కెట్ పేరుతో.. భారీ లాభాల ఆశ చూపి మోసపుచ్చిన ఘటన తెలిసిందే.;

Update: 2026-01-28 07:03 GMT

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే చాలు.. స్వల్ప వ్యవధిలో భారీ లాభాల్ని సొంతం చేసుకోవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి 500 రెట్ల లాభాన్ని సొంతం చేసుకోవచ్చంటూ మాజీ ఐపీఎస్ సతీమణిని మోసం చేసిన ఉదంతానికి సంబంధించి నలుగురు నిందితుల్ని సైబర్ పోలీసులు పట్టేశారు. కొద్దిరోజుల క్రితం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణిని సైబర్ నేరస్తులు స్టాక్ మార్కెట్ పేరుతో.. భారీ లాభాల ఆశ చూపి మోసపుచ్చిన ఘటన తెలిసిందే. ఈ ఉదంతంలో ఆమె రూ.2.58 కోట్లు మోసపోయిన వైనం పెను సంచలనంగా మారింది.

ఈ మోసాన్ని సీరియస్ గా తీసుకున్న సైబర్ పోలీసులు తాజాగా పశ్చిమబెంగాల్ కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరస్తులకు అవసరమైన బ్యాంక్ ఖాతాల్ని సమకూర్చిన వారిగా ఈ నలుగురిని నిర్ధారించారు. ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. వీరి అకౌంట్లో రూ.45 లక్షలు ఉండగా.. ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు.

కొద్దిరోజుల క్రితం బంజారాహిల్స్ లో నివాసం ఉండే మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య వాట్సాప్ నెంబరుకు షేర్ మార్కెట్ లింకు రావటం.. అందులో తాము చెప్పినట్లుగా పెట్టుబడులు పెడితే.. స్వల్ప వ్యవధిలో 500 రెట్ల లాభాన్ని సొంతం చేసుకోవచ్చని చెప్పటం.. ఆమె వారి మాటల్ని నమ్మారు. ట్రేడింగ్ మీద ఆమెకు సరైన రీతిలో అవగాహన లేకపోవటంతో.. తక్కువ సమయంలోనే అంత భారీగా లాభాలు వస్తాయని నమ్మి.. భర్తకు తెలీకుండా డబ్బులు పెట్టారు.

సదరు సైబర్ దొంగలు.. తమను తాము మార్కెట్ నిపుణులుగా పరిచయం చేసుకోవటంతో పాటు.. డిసెంబరు 24 నుంచి జనవరి 5 వరకు 19 విడతల్లో రూ.2.58 కోట్ల పెట్టుబడి పెట్టించారు. రూ.2 కోట్ల లాభం వచ్చినట్లుగా డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద చూపించారు. కానీ.. ఆ డబ్బును విత్ డ్రా చేయాలంటే మరింత మొత్తాన్ని డిపాజిట్ చేయాలని.. అసలుతో కలిపి డిపాజిట్ చేసిన మొత్తం కూడా తిరిగి వస్తుందని చెప్పటం.. అప్పటికే భారీగా డబ్బులు పెట్టటంతో ఆమె అనుమానించారు.

ఆ వెంటనే ఆమె 1930 ద్వారా సైబర్ పోలీసులకు ఫోన్ చేశారు. వారు రంగంలోకి దిగటం.. మాయమాటలు చెప్పి మోసం చేసిన వైనం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ మోసాన్ని సీరియస్ గా తీసుకున్న సైబర్ పోలీసులు విచారణ జరిపారు. ఎట్టకేలకు సైబర్ నేరస్తులకు బ్యాంకు ఖాతాల్ని సమకూర్చిన నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా.. ఈ దారుణ మోసానికి సంబంధించిన కొన్ని వివరాలు వెలుగు చూశాయి. పాత్రధారులు దొరికిన నేపథ్యంలో సూత్రధారుల్ని కూడా అరెస్టు చేస్తే.. చాలానే మోసాలకు సంబంధించిన వివరాలు వెలుగు చూసే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News