ఆస్ట్రేలియా రూల్ ను గోవాలో ఫాలో కానున్నారా?
చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా సోషల్ మీడియాకు బానిస అవుతున్న టీనేజర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.;
చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా సోషల్ మీడియాకు బానిస అవుతున్న టీనేజర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియా మత్తులో పడిన యువత.. చదువు మీద ఫోకస్ పెద్దగా పెట్టని పరిస్థితి. అంతేకాదు.. అష్టదరిద్రాలకు సోషల్ మీడియా సెంటర్ పాయింట్ గా మారిందన్న పరిశోధనలకు ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వినియోగం విషయంలో చిన్నారులకు కఠిన నిబంధనల్ని విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం.. అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా అమలు చేస్తున్న చట్టాన్ని వివిధ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పరిణామాల్ని మదింపు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా అనుసరించిన సోషల్ చట్టాన్ని భారత్ లోని కొన్ని రాష్ట్రాలు సైతం అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఇందులో గోవా రాష్ట్రం ఆ దిశగా అడుగులు వేస్తోందన్న మాట బలంగా వినిపిస్తోంది. గోవాలోని చిన్నారులు సోషల్ మీడియాను యాక్సెస్ చేసుకోకుండా ఉండటం ఎలా? అన్నదిప్పుడు టాస్కుగా మారింది.
ఇదే విషయాన్ని గోవా ఐటీ మంత్రి రోహన్ ఖౌంటే ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియా చిన్నారులను అనవసరమైన అంశాల వైపు చూసేలా చేస్తున్నాయని.. దీని కారణంగా అనేక దుష్పరిణామాలకు కారణాలుగా మారుతున్నట్లుగా పేర్కొన్నారు. చిన్నారులు విద్య.. సాంకేతిక అంశాలపై మరింత ఫోకస్ పెట్టేలా చేయటమే తమ ముందున్న లక్ష్యంగా పేర్కొన్నారు. ఏఐ యుగంలో చిన్నారులు విద్యపై మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే సోషల్ మీడియా ప్రభావానికి గురైన చిన్నారులకు సంబంధించి వారి తల్లిదండ్రుల నుంచి ఇప్పటికే బోలెడన్ని ఫిర్యాదులు వచ్చాయని.. అందుకే గోవాలోనూ ఆస్ట్రేలియా చట్టాన్ని అమలు చేయాలన్న ఆలోచనను అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వీలుగా ఒక టీం అధ్యయనం చేస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ అంశంపై గోవా సర్కారు కీలక నిర్ణయాల్ని తీసుకుంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అదే నిజమైతే.. ఈ తరహా నిర్ణయాల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. మరి.. దీనిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా స్పందిస్తారో?