ఒకే వేదికపై ఇద్దరు చంద్రులు

Update: 2016-03-19 07:23 GMT
కొద్దికాలంగా ప్రచ్ఛన్న యుద్ధంలో ఉన్న ఇద్దరు చంద్రులు శనివారం మళ్లీ కలిశారు. హైదరాబాద్ లో జరుగుతున్న న్యాయాధికారుల సదస్సు వేదికపై ఏపీ సీఎం చంద్రబాబు - తెలంగాణ సీఎం కేసీఆర్ లు కలిశారు. భారత ప్రధాన న్యాయమూర్తి - సుప్రీం కోర్టు న్యాయమూర్తులు - తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సీజే - ఇతర న్యాయమూర్తులు పాల్గొన్న ఈ సదస్సుకు ఇద్దరు చంద్రుళ్లు కూడా హాజరయ్యారు. చంద్రబాబు - కేసీఆర్ లు ఇద్దరూ ఇతర న్యాయమూర్తులతో కలిసి జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు.
    
కాగా సదస్సులో తొలుత చంద్రబాబు మాట్లాడగా, అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. అయితే... వేదికపై ఇద్దరు చంద్రులు ఒక్క చోట కూర్చోలేదు. ఇద్దరి మధ్య మూడు సీట్ల గ్యాప్ ఉంది. ఆ సీట్లలో మరో ముగ్గరు న్యాయమూర్తులు కూర్చున్నారు.  అయితే.. చంద్రబాబు తన ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావనను తెచ్చారు... కేసీఆర్ కూడా చంద్రబాబు పేరును ప్రస్తావించారు.
    
కాగా రాష్ట్ర విభజన తరువాత ఇద్దరు చంద్రుల మధ్య విభేదాలు ఏర్పడి, అనంతరం ఓటుకు నోటు కేసుతో పీక్ స్టేజికి చేరినా  ఆ తరువాత ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నుంచి ఇద్దరి మధ్య స్నేహం పూసింది. కేసీర్ తలపెట్టిన యాగంతో ఆ స్నేహం మరింత గట్టి పడింది. కానీ, కొద్ది కాలంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రావడంతో మళ్లీ మాటల యుద్ధాలు మొదలై ఎడమొహం పెడమొహంగా ఉండడం మొదలుపెట్టారు. ఈలోగా కేసీఆర్ తెలంగాణ టీడీపీని మొత్తం ఊడ్చేయడంతో విభేదాలు మరింత ముదిరాయి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న సమయంలో ఇద్దరూ ఒకేచోట కనిపించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఏపీ - తెలంగాణ రెండు రాష్ట్రాల శాసనసభ సమావేశాలు ఒకేసారి జరుగుతున్నా కూడా ఇద్దరూ ఒకేసారి తారసపడలేదు. న్యాయమూర్తుల సదస్సు కారణంగా మళ్లీ ఇద్దరూ ఒకే వేదికపై దర్శనమిచ్చారు. అయితే... ఇటీవల కనిపించిన ఆలింగనాలు - ఆత్మీయ పలకరింపులు మాత్రం లేవు.
Tags:    

Similar News