షర్మిల వద్దకు క్యూ కడుతున్న ప్రముఖులు

Update: 2021-02-17 13:30 GMT
గడిచిన వారం.. పది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అనుభవానికి.. అనుభవ రాహిత్యానికి మధ్య వ్యత్యాసం ఇట్టే కనిపించక మానదు. పక్కా ప్లానింగ్.. అంతకు మించిన గ్రౌండ్ వర్కు ఉంటే.. ఒక రాజకీయ పార్టీ పెట్టక ముందే.. ఆ పార్టీకి హైప్ తీసుకురావటం ఎలానో వైఎస్ కుమార్తె షర్మిలను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టనున్న షర్మిల.. తన పార్టీకి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.

పార్టీ పెట్టకుండానే.. పలువురు ప్రముఖులు ఆమెను కలిసేందుకు లోటస్ పాండ్ కు వెళ్లటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు. అంతేకాదు.. ఆమెకు టీంగా మారేందుకు ముందుకు వస్తున్న ముఖ్యులు చూస్తున్నప్పుడు.. కేవలం వారం.. పది రోజుల్లోనే ఇంత వర్కువుట్ చేస్తారా? అంటే నో అనే చెప్పాలి. చాలా కాలంగా సాగుతున్న ప్లానింగ్ కు.. తుది రూపమే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలుగా చెప్పాలి.

ఎందుకంటే.. ఈ రోజు (బుధవారం) ఉదయం షర్మిల నివాసమైన లోటస్ పాండ్ కు ప్రజా గాయకుడు గద్దర్ వెళ్లి.. షర్మిలతో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను తక్కువ చేయటానికి లేదు. ఇవాల్టి రోజున ఆయన ఇమేజ్ తక్కువగా కనిపించొచ్చు కానీ.. ఆ రోజున నిమ్స్ లో కేసీఆర్ చేత దీక్ష ముగింపచేసి.. ఆయన చేతికి నిమ్మరసం గ్లాసు ఇచ్చింది గద్దరే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. షర్మిల ఆంధ్రా మూలాలపై ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్న వేళ.. తెలంగాణకు ప్రతిరూపంగా ఉండే ఉద్యమనేతలు ఒక్కొక్కరుగా షర్మిలను కలవటం ద్వారా.. ఆమెకు అన్ని వర్గాల నుంచి ఆమోదం ఉందన్న భావన సాధారణ ప్రజానీకానికి కలిగేలా చేస్తారన్న మాట వినిపిస్తోంది.

ఇప్పటికే పలు జిల్లాలకు చెందిన వైఎస్ ఫాలోయర్లు షర్మిలను కలవటం.. ఆమెకు మద్దతుగా ఉంటామని మాట ఇచ్చి వెళ్లటం జరుగుతోంది. ఈ రోజు విషయానికి వస్తే ఉదయం గద్దర్.. సాయంత్రానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ పార్టీలో చేరటం చూస్తూ.. వ్యూహం పక్కాగా ఉందనిపించక మానదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. షర్మిల పెట్టే పార్టీకి సలహాదారులుగా మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఐపీఎస్ ఉదయసింహాలు కీలక భూమిక పోషించనున్నారు.

ఈ ఇద్దరు అధికారులు దివంగత వైఎస్ హయాంలో కీలక పదవుల్లో ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఉదయసింహా సీఎస్ వోగా వ్యవహరిస్తే.. ప్రభాకర్ రెడ్డి నాటి సీఎంవోలో అడిషనల్ సెక్రటరీగా ఉన్నారు. మరో వైపు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య షర్మిలను కలిసి తన మద్దతును ప్రకటించారు. ఇలా ఒక్కొక్కరుగా తెలంగాణ సమాజానికి చెందిన వివిధ వర్గాల వారు షర్మిలకు తమ మద్దతును ప్రకటించటం చూస్తే.. గులాబీ కారు మీద షర్మిల మేఘం నెమ్మది నెమ్మదిగా కమ్మేస్తుందన్నభావన కలుగక మానదు.
Tags:    

Similar News