తిరుమలకు జగన్ ను ఒంటరిగా వద్దంటున్న బాబు

Update: 2020-09-23 07:00 GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విపక్ష నేత చంద్రబాబు ఒక సూచన చేశారు ఈ రోజు సాయంత్రం తిరుమలకు వెళుతున్న ఆయన్ను శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారి ఆలయంలోకి అడుగు పెట్టాలని కోరారు. తాజాగా చిత్తూరు జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడిన ఆయన.. జగన్ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు.

అన్యమతస్థుడైన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మతం మారినట్లుగా వీడియోలు బయటకు తెచ్చారని.. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో బైబిల్ పక్కన పెట్టుకొని ప్రమాణం చేశారన్నారు. అన్యమత ఆచారాల్ని కించపర్చకూడదన్నచంద్రబాబు.. ఇతర మతాల్ని చులకన చేయరాదన్నారు. అన్యమతస్థుడైన దేశాధ్యక్షుడే డిక్లరేషన్ఇచ్చారని.. అలాంటిది ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు.

బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలు ఇస్తే జగన్ తో పాటు.. రాష్ట్రానికి కూడా అరిష్టమని చెప్పిన చంద్రబాబు.. సీఎం దంపతులు కలిసి ఇవ్వాలన్నారు. అన్యమత ఆచారాల్ని కించపర్చరాదని.. ఇతర మతాలను చులకన చేయరాదన్న ఆయన.. చట్టపరంగా ఎన్నికైన ముఖ్యమంత్రి చట్ట ఉల్లంఘన చేయటం సరికాదన్నారు.

ఇప్పటివరకు డిక్లరేషన్ ఇష్యూ ఒకటి హాట్ టాపిక్ గా మారిన వేళ.. స్వామివారికి పట్టువస్త్రాల్ని సమర్పించే విషయంలో దంపతులు ఇద్దరు ఉండాలన్న సంప్రదాయాన్ని బాబు గుర్తు చేయటంతో మరో అంశం తెర మీదకు వచ్చినట్లైంది. మరి.. బాబు చెప్పినట్లే.. డిక్లరేషన్ ఇవ్వటం.. భార్యతో కలిసి పట్టువస్త్రాల్ని స్వామివారికి ఇవ్వటం లాంటివి సీఎం జగన్ చేస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News