విడాకులు ఆపిన చిరు సినిమా... విషయం ఏమిటంటే..!
ఇటీవల కాలంలో దేశంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.;
ఇటీవల కాలంలో దేశంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కూర్చును మాట్లాడుకుంటే సమసి పోయే సమస్యలను సైతం ఈగోలకు పోయి విడాకుల వరకూ తెచ్చుకుంటున్నాయి కొన్ని జంటలు. ఫలితంగా పిల్లలను సింగిల్ పేరెంట్ కిడ్స్ గా మారుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బాస్టర్ "మన శంకర వరప్రసాద్ గారు" సినిమా చూసిన ఓ జంట విడాకులను క్యాన్సిల్ చేసుకున్న విషయం తెరపైకి వచ్చింది.
అవును... సమాజాన్ని చూసే సినిమా కథలు రాస్తారని ఒకరంటే.. ఆ సినిమాలే సమాజంపైనా పెను ప్రభావం చూపిస్తుంటాయని చెబుతారు. అలా అని దొంగ సినిమాలు చూసిన వాళ్లంతా దొంగలు అయిపోతారని కాదు.. పోలీసు సినిమాలు చూసి పోలీసులు అవ్వరనీ కాదు. ఏదైనా తీసుకోవడంలో ఉంటుంది. గతంలో పాత సినిమాలు చూసి కలిసిపోయిన అన్నదమ్ములు ఉన్నారని అంటారు. అప్పట్లోని కథల్లో నేచురాలిటీ అలా ఉండేది!
ఈ క్రమంలో తాజాగా వచ్చిన "మన శంకర వరప్రసాద్ గారు" సినిమాలో భార్యభర్తల మధ్య బంధం, మధ్యలో వచ్చే మూడో వ్యక్తి ప్రమేయం, దంపతుల మధ్య ఈగోలు, పిల్లలు సింగిల్ పేరెంట్ కిడ్ గా బ్రతకడం, విడాకుల తర్వాత పిల్లలు తల్లి వద్దే ఉండటంతో.. తండ్రి పడే మనోవేదన అన్నీ స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు.. సక్సెస్ అయ్యారు! ప్రధానంగా.. దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం లేకపోవడం ముఖ్యమనే విషయం స్పష్టంగా చెప్పారు.
ఈ క్రమంలో.. విడాకులు తీసుకుందాం అనుకుంటున్న ఒక జంట 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చూసి ఆ ఆలోచనను విరమించుకుందనే విషయం తన దృష్టికి రావడంతో చాలా సంతోషించినట్లు తాజాగా చిరంజీవి వెల్లడించారు. మూడు నెలల ముందు విడాకులు తీసుకుందాం అనుకుని విడిగా ఉంటున్న భార్యాభర్తలు వేర్వేరుగా ఈ సినిమా చూశారని.. అందులో కొన్ని సన్నివేశాలు చూశాక ఆలోచనలో పడి.. మళ్ళీ కలిసి మాట్లాడుకున్నారని.. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
ప్రధానంగా ఈ సినిమాలో తన ఇంటికి వచ్చి పచ్చడి బాటిల్ ఇచ్చి వెళ్లిపోతున్న సమయంలో హీరో తల్లి హీరోయిన్ తో మాట్లాడుతూ... భార్యా భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా వాళ్లే పరిష్కరించుకోవాలని.. మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదని చెప్పే డైలాగులు వారిలో మార్పు తెచ్చాయని చిరంజీవి వెల్లడించాడు. ఈ సందర్భంగా... ఆ సన్నివేశం రాసిన దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ అని అన్నారు. కాగా.. ఈ సినిమా సంక్రాతి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే!