ట్రంప్ వెనక్కి తగ్గారా.. రిక్వస్ట్ మేరకు ఓ ఛాన్స్ ఇచ్చారా..!
అవును... ఇరాన్ పై దాడికి అమెరికా సిద్ధమైందని కథనాలొచ్చిన వేళ.. ప్రస్తుతం ఆ ఆలోచననుంచి ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోంది.;
ఇరాన్ లో సుమారు గత రెండు వారాలకు పైగా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే.. ఫలితంగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.. ఎటు చూసినా నినాదాలు, హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆందోళనకారులను ఇరాన్ బలంగా అణచివేస్తోంది. దీంతో.. ఇరాన్ పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమైందని కథనాలొస్తున్న వేళ.. తాజాగా ఈ విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారని అంటున్నారు. అందుకు ఓ కీలక కారణం తెరపైకి వస్తోంది.
అవును... ఇరాన్ పై దాడికి అమెరికా సిద్ధమైందని కథనాలొచ్చిన వేళ.. ప్రస్తుతం ఆ ఆలోచననుంచి ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోంది. టెహ్రాన్ పై దాడుల ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా నుంచి ఆందోళన లేదనే సమాచారం.. ఉద్రిక్తతలు కాస్త సద్దుమణగడంతో ఇరాన్ తమ గగనతలాన్ని తిరిగి తెరిచినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలో గల్ఫ్ దేశాల రిక్వస్ట్ ఆసక్తిగా మారింది.
నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడితే దాడులు తప్పవని అమెరికా హెచ్చరిస్తున్నవేళ.. పలు గల్ఫ్ దేశాలు దౌత్య ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరాన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ట్రంప్ ను విజ్ఞప్తి చేసినట్లు కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా.. సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్.. దౌత్య ప్రయత్నాలు మొదలుపెట్టాయని.. అమెరికాతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు ఓ గల్ఫ్ దేశ ప్రతినిధి అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన పాకిస్థాన్ లోని ఇరాన్ రాయబారి.. ప్రస్తుతానికి తాము దాడి చేయాలనుకోవట్లేదని ట్రంప్ హామీ ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు. మరోవైపు, అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసివేసిన ఇరాన్.. మళ్లీ విమాన రాకపోకలకు అనుమతించింది. ఈ పరిణామాలతోనే టెహ్రాన్ పై సైనిక చర్యను అమెరికా తాత్కాలికంగా విరమించుకున్నట్లు కన్పిస్తోంది.
ఇరాన్ అధికారులపై అమెరికా ఆంక్షలు!:
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేస్తున్నారన్న కారణంతో ఇరాన్ కు చెందిన అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. నిరసనకారులను అణచివేతలో కీలక భూమిక పోషిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ జాతీయ భద్రత కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానితో పాటు ఆ దేశ లా ఎన్ ఫోర్స్ మెంట్, రివల్యూషనరీ గార్డ్ కు చెందిన నలుగురు రీజినల్ కమాండర్లపైనా యూఎస్ ఆంక్షలు విధించింది. వీరితో పాటు ఇరాన్ ఆర్థిక సంస్థలకు చెందిన 18 మందిపైనా ఆంక్షలు పెట్టింది.
కాగా... ఘోరంగా పడిపోయిన కరెన్సీ విలువ, అత్యధికంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఇరాన్ లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళన చేపడుతోన్న సంగతి తెలిసిందే. వీరిని అడ్డుకునే క్రమంలో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. దీంతో... వేలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా.. మరికొన్ని వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు.