తీరంలో హైడ్రామా.. పాక్ పడవ ‘అల్-మదీనా’ సీజ్.. 9 మంది సిబ్బంది అరెస్ట్
భారత సముద్ర సరిహద్దుల్లో నిఘా నీడను దాటుకుని లోపలికి రావాలనుకున్న పాకిస్థాన్ ప్రయత్నాలను ఇండియన్ కోస్ట్ గార్డ్ భగ్నం చేసింది.;
భారత సముద్ర సరిహద్దుల్లో నిఘా నీడను దాటుకుని లోపలికి రావాలనుకున్న పాకిస్థాన్ ప్రయత్నాలను ఇండియన్ కోస్ట్ గార్డ్ భగ్నం చేసింది. 2026 జనవరి 14 రాత్రి అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలో అక్రమంగా చొరబడిన ‘అల్-మదీనా’ అనే పాకిస్థానీ చేపల వేట పడవను కోస్ట్ గార్డ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పడవలోని తొమ్మిది మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తీరానికి తరలించాయి.
ఏం జరిగింది?
అరేబియా సముద్రంలో సాధారణ గస్తీ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ నౌకకు బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో కదులుతున్న ఒక బోటు కనిపించింది. అది భారత జలాల్లోకి ప్రవేశించినట్లు గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కోస్ట్ గార్డ్ హెచ్చరికలు జారీ చేయగానే పట్టుబడతామన్న భయంతో పాక్ పడవ వెనక్కి మళ్లి పారిపోయేందుకు ప్రయత్నించింది. రాత్రి వేళ అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో కూడా మన జవాన్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, ఆ పడవను చుట్టుముట్టారు. చివరకు భారత జలాల్లోనే దాన్ని నిలువరించి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
ఈ ఆపరేషన్‌పై గుజరాత్ డిఫెన్స్ పీఆర్వో వింగ్ కమాండర్ అభిషేక్ కుమార్ తివారీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా వివరాలు వెల్లడించారు. "చీకటి సమయంలో నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ‘అల్-మదీనా’ బోటులోని 9 మంది సిబ్బందిని విచారిస్తున్నాం. ప్రాథమిక సమాచారం ప్రకారం వారంతా పాకిస్థానీయులేనని భావిస్తున్నాం " అని ఆయన పేర్కొన్నారు.
గతంలోనూ ఇవే తరహా చొరబాట్లు
భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజెడ్) లోకి పాకిస్థానీ పడవలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఇటువంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. డిసెంబర్ 2025న 11 మంది సిబ్బందితో కూడిన పాక్ బోటును ఈఈజెడ్ పరిధిలో అక్రమంగా చేపల వేట సాగిస్తుండగా పట్టుకున్నారు. నవంబర్ 2023న ‘నజ్-రే-కరం’ అనే నౌక భారత జలాల్లోకి సుమారు 15 కిలోమీటర్ల లోపలికి రాగా కోస్ట్ గార్డ్ దాన్ని అడ్డుకుని 13 మందిని అరెస్ట్ చేసింది.
భద్రత కట్టుదిట్టం
తీర ప్రాంతాల ద్వారా ఉగ్రవాదులు.. అక్రమ రవాణాదారులు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ తీరంలో భద్రతను అత్యంత కఠినతరం చేసింది. అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, డ్రోన్లు, నిరంతర నౌకా గస్తీ ద్వారా చొరబాటుదారుల ఆట కట్టిస్తోంది. తాజాగా పట్టుబడిన 9 మందిని ఉగ్రవాద కోణంలో గానీ గూఢచారి కోణంలో గానీ విచారించే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.