జస్ట్ రూ.1700 కోట్ల ఫ్రాడ్ చేసిన ఉప్పలపాటి హిమబిందు అరెస్టు

Update: 2021-08-06 03:23 GMT
రూ.లచ్చ రూపాయిలు రుణం ఇవ్వరా నాయనా.. అంటే బ్యాంకోడు మనకేసి చూసే చూపులు.. చెప్పే కండీషన్లు.. పెట్టించుకునే సంతకాలు.. చెక్ చేసుకునే బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ చాటభారతమంత ఉంటుంది. అలాంటి బ్యాంకులు ఏం చూసి ఇస్తాయో కానీ.. కంపెనీలకు వందల కోట్లు ఇచ్చేస్తుంటాయి. లచ్చకే సవాలక్ష ప్రశ్నలు వేసి.. ఎందుకు అప్పు అడిగాం భగవంతుడా? అన్నట్లుగా చేస్తాయి. అలాంటి బ్యాంకులు మోసపోయే తీరు చూస్తే భలే సిత్రంగా ఉంటుంది. బడా బాబులు బ్యాంకులకు వచ్చి అప్పు కావాలన్న వెంటనే రెడ్ కార్పెట్ వేసి మరీ.. ఆహ్వానించే వైనం రోటీన్ కు భిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు.

తాజాగా వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఈడీ (ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్) అధికారులు అరెస్టు చేయటం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. దాదాపు రూ.1700 కోట్లకు మోసానికి పాల్పడిన ఆమెను అదుపులోకి తీసుకొని.. అనంతరం అరెస్టు చేశారు. ఇంతకీ ఆమె అంతలా ఎలా మోసం చేశారు? ప్లానింగ్ ఎలా జరిగిందన్న విషయాల్లోకి వెళితే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

నకిలీ పత్రాల్ని సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందిన ముగ్గురు డైరెక్టర్లలో ఉప్పలపాటి హిమబిందును అరెస్టు చేయగా.. మిగిలిన ఇద్దరు డైరెక్టర్ల (ఉప్పలపాటి వెంకట రామారావు.. వెంకటరమణ) కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. 2018లో ఈ కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం నోటీసులు ఇచ్చింది. అయితే.. డైరెక్టర్లు స్పందించకపోవటంతో హిమబిందును  చేశారు.

ఇంతకీ మోసం ఎలా జరిగిందంటే.. నకిలీ పత్రాల్ని క్రియేట్ చేసి.. బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లుగా చెబుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.539 కోట్లు.. ఎస్ బిఐ.. ఆంధ్రా.. కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.1207 కోట్లు రుణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. తమకు బీఎస్ఎన్ఎల్ నుంచి భారీగా బిల్లులు రావాల్సి ఉన్నాయని.. అవి వచ్చినంతనే రుణాల్ని క్లియర్ చేస్తామని నమ్మ బలికారు. నిజమేనని బ్యాంకులు భావించి.. ఆగినట్లు చెబుతున్నారు.

అయితే.. బీఎస్ఎన్ఎల్ ను రూ.33 కోట్లు మాత్రమే రావాల్సి ఉండగా అందుకు భిన్నంగా భారీ మొత్తం పెండింగ్ లో ఉన్నట్లుగా చెప్పటం.. అదంతా ఫేక్ అన్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. కళ్లు తెరిచిన బ్యాంకులు చట్టబద్ధంగా చర్యలు కోసం ప్రయత్నించగా.. ఆమె వ్యాపార భాగస్వామ్యులు మాత్రం తప్పించుకున్నారు. అడ్డంగా బుక్ అయ్యింది మాత్రం ఉప్పలపాటి హిమబిందునే అన్న మాటలు వాణిజ్య వర్గాలు నోటి నుంచి వినిపిస్తోంది. బ్యాంకులకు బోల్తా కొట్టించే ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News