ముహూర్తం పెట్టిన వంగవీటి ఆశ.. విషయం ఏంటంటే.. !
ప్రజా సేవ కోసం వస్తున్నట్టు చెప్పిన వంగవీటి రంగా వారసురాలు వంగవీటి ఆశాకిరణ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.;
ప్రజా సేవ కోసం వస్తున్నట్టు చెప్పిన వంగవీటి రంగా వారసురాలు వంగవీటి ఆశాకిరణ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో చేరకపోయినా రాధా రంగా మిత్రమండలిని ఏకీకృతం చేసి తద్వారా ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో వంగవీటి ఆశకిరణ్ ముందుకు సాగుతు న్నారు. దీనిలో భాగంగా ఈనెల 26 నుంచి ప్రజల్లోకి వచ్చేందుకు ఆమె ముహూర్తం పెట్టుకున్నట్టు రాధా రంగా మిత్రమండలి వర్గాలు చెప్పుకొచ్చాయి. దీనికి సంబంధించి తాజాగా మిత్రమండలి వర్గాలతోఆమె భేటీ అయ్యారు.
ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనే అంశాలపై చర్చించారు. వాస్తవానికి ఆమె కూడా తనపై ఉన్న కాపు ముద్రను పక్కనపెట్టి, ప్రజలకు చేరువ కావాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే తను అందరికీ సహాయం చేస్తానని అందరి సమస్యలను పట్టించుకుంటా నని, ఎవరు ఏ సమస్యతో వచ్చినా దానిపై దృష్టి పెడతానని కూడా ఇటీవల చెప్పారు. దీనిలో భాగంగానే ఇప్పుడు సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రాజకీయాలు మాట ఎత్తకుండా ప్రజల్లోకి రావాలన్న ఆలోచనతో ఆశకిరణ్ ఉన్నారు.
ఇదే విషయాన్ని రాధా రంగా మిత్రమండలి సభ్యులకు కూడా చెప్పారు. తన తొలి ప్రయాణం ఏలూరు నుంచి లేదా తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభించే దిశగా ఆమె ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈనెల 26న రంగా వర్ధంతి ఉన్న నేపథ్యంలో ఆ రోజు నుంచి ఆమె ప్రజల్లోకి వచ్చేందుకు సన్నద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నిధుల సమీకరణ, కార్యకర్తల సమీకరణ, రాధా రంగా మిత్రమండలి ఐక్యం చేయడం వంటి కీలక అంశాలపై ఆశకిరణ్ దృష్టిపెట్టారు. ముందు తనను తాను నిరూపించుకుని ఆ తర్వాత రాజకీయంగా అడుగులు వేయాలన్న ఆలోచనలో ఆశకిరణ్ ఉన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి ఆమె ఏదో ఒక పార్టీలో చేరడం అయితే ఖాయం. అయితే దీనికి ముందు తనను తాను నిరూపించుకుంటే తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా ఉన్న సానుభూతిని సొంతం చేసుకోగలిగితే అది తనకు మేలు చేస్తుందన్న ఆలోచనలో కూడా ఆశ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆవిడ ఈనెల 26 నుంచి పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఇమేజ్ను పెంచుకునే దిశగా అడుగులు వేయాలనేది వ్యూహంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది.. రాజకీయాలకతీతంగా ఎంతమంది వెంట వస్తారు.. అనేది చూడాలి.