దేశం మొత్తం ఆ నేత గురించే చర్చ.. కారణం ఆ కార్పొరేషన్ లో బీజేపీ గెలవడమే?
కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని అందించాయి. మొత్తం 101 వార్డులున్న ఈ కార్పొరేషన్‌లో భారతీయ జనతా పార్టీ 50 స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా నిలిచింది.;
కేరళ రాజకీయాల్లో కొన్ని పరిణామాలు గెలుపోటములకంటే పెద్ద సంకేతాలను ఇస్తాయి. ఓ పార్టీ గెలిచిందా లేదా అన్నదానికంటే, ఆ గెలుపును ప్రత్యర్థి పార్టీ నేత ఎలా స్వీకరించాడు అన్నదే అసలు రాజకీయ సందేశంగా మారుతుంది. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కూడా అలాంటి ఒక అరుదైన రాజకీయ క్షణాన్ని దేశం ముందు ఉంచాయి. బీజేపీ విజయం సాధించినందుకు కాంగ్రెస్ నేత సంబరాలు చేసుకోవడం.. గెలిచిన పార్టీకి ఏదో ముభావంగా పద్ధతి ప్రకారం శుభాకాంక్షలు చెప్పడం కాదు.. కేరళ రాజకీయాల్లో లోతైన మార్పులు సంభవిస్తున్నాయనేందుకు సూచన.
కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని అందించాయి. మొత్తం 101 వార్డులున్న ఈ కార్పొరేషన్‌లో భారతీయ జనతా పార్టీ 50 స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా నిలిచింది. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా కమ్యూనిస్టు, కాంగ్రెస్ ప్రభావం బలంగా ఉన్న కేరళలో ఇది చిన్న విషయం కాదు. కమ్యూనిస్టుల ఆధిపత్యం ఉన్న పట్టణంలో కమలం వికసించడం బీజేపీకి మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలకే మైలురాయిగా మారింది.
ఈ ఫలితాలు అధికార సీపీఐ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌కు గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది. 29 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన ఎల్‌డీఎఫ్‌కు ఇది హెచ్చరికగా మారగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మాత్రం 19 స్థానాలకు పరిమితమై మరింత వెనుకబడింది. కొన్ని ఎన్నికల్లో బలహీనపడుతున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు మరోసారి గట్టి షాక్ ఇచ్చినట్లయ్యాయి.
అయితే ఈ రాజకీయ దృశ్యంలో అందరినీ ఆశ్చర్యపరిచింది కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం. పార్టీ ఓడిపోయిన వేళ, సాధారణంగా నేతలు మౌనంగా ఉండడం లేదా.. ఫలితాలను విమర్శించడం, ముభావంతంగా శుభాకాంక్షలు చెప్పడం చూస్తుంటాం. కానీ శశిథరూర్ మాత్రం భిన్నంగా స్పందించారు. బీజేపీ విజయానికి బహిరంగంగా శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా బీజేపీ కార్యాలయాలకు 100 కిలోల మిఠాయిలు పంపిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ పెద్ద చర్చకు దారి తీసింది.
శశిథరూర్ వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడిని పెంచాయి. ‘45 ఏళ్లుగా కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే ఈ ఫలితం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అధికార పక్షం చేస్తున్న అక్రమాలను తాను ఎన్నోసార్లు ప్రశ్నించినా మార్పు రాలేదని, ఇప్పుడు ప్రజలే మార్పు కోరుకుంటున్నారని ఆయన చెప్పడం కాంగ్రెస్ పార్టీకి అసౌకర్యంగా మారింది. ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయమా? లేక కాంగ్రెస్‌లోని అంతర్గత అసంతృప్తికి ప్రతిబింబమా? అన్న చర్చ మొదలైంది.
బీజేపీ ఈ ఫలితాలను రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు శుభసూచకంగా చూస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క లోక్‌సభ సీటు గెలిచిన పార్టీ, ఇప్పుడు రాజధాని నగర కార్పొరేషన్‌లో అతి పెద్ద పార్టీగా అవతరించడం వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విజయాన్ని స్వాగతిస్తూ, ప్రజలు మార్పు వైపు అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పడం ద్వారా రాజకీయ సందేశాన్ని స్పష్టంగా ఇచ్చారు.
ఇదంతా చూస్తే ఒక విషయం స్పష్టం అమవుతుంది. కేరళ రాజకీయాలు ఇక పాత రీతిలో కొనసాగేలా లేవు. కమ్యూనిస్టులపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, కాంగ్రెస్‌లో కనిపిస్తున్న దిశాహీనత, బీజేపీ క్రమంగా పెంచుకుంటున్న పట్టుదల ఇవన్నీ కలిసి కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తున్నాయి. శశిథరూర్ చర్య ఈ మార్పుకు ఒక ప్రతీకగా మారింది. ఒక పార్టీ విజయాన్ని ప్రత్యర్థి పార్టీ నేత అభినందించడం ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ ఆ అభినందన రాజకీయ సందేశంగా మారినప్పుడు, అది పెద్ద మార్పులకు సంకేతంగా మారుతుంది. తిరువనంతపురం ఎన్నికల తర్వాత కేరళ రాజకీయాల్లో మొదలైన ఈ చర్చలు, వచ్చే ఎన్నికల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారడం ఖాయం.