టీడీపీ టాక్: మంత్రి వర్గ ప్రక్షాళన ఉన్నట్టా.. లేనట్టా ..!
మంత్రివర్గ ప్రక్షాళనపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. సుమారు 10 నుంచి 15 మంది వరకు మంత్రి పదవిని దక్కించుకోవాలని భావిస్తున్నారు.;
మంత్రివర్గ ప్రక్షాళనపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. సుమారు 10 నుంచి 15 మంది వరకు మంత్రి పదవిని దక్కించుకోవాలని భావిస్తున్నారు. వీరిలో సీనియర్లనుంచి జూనియర్ల వరకు చాలామంది ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. నిజానికి ఇటీవల కాలంలోనే మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందని కూడా ఒక చర్చ నడిచింది. ఒకరిద్దరు మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తారని మీడియా, రాజకీయ వర్గాలు కూడా భావించాయి.
కానీ, అనూహ్యంగా ఈ విషయం వాయిదా పడుతూ వచ్చింది. ఇక త్వరలోనే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందా ఉండదా అనే విషయంపై మరోసారి టిడిపి వర్గాల్లో చర్చ నడుస్తోంది. విశాఖపట్నం నుంచి చిత్తూరు వరకు కూడా కొంతమంది కీలక నాయకులు మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు మంత్రి వర్గంలో సీటు దక్కించుకోవాలనే ది ప్రయత్నం. అదేవిధంగా మరికొందరు ఎమ్మెల్సీలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
దీంతో మంత్రివర్గ ప్రక్షాళన కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ విషయంపై చంద్రబాబు ఇంతవరకు దృష్టి పెట్టలేదు. దాదాపు మంత్రివర్గ ప్రక్షాళన ఉండకపోవచ్చు అన్నది కూడా పార్టీలో నాయకులు భావిస్తున్నారు. గత 2014 -19 మధ్య కేవలం ఒక్కసారి మాత్రమే మంత్రివర్గంలో చిన్నపాటి మార్పులు చేశారు. ఒకరిద్దరు మంత్రులను తప్పించి వేరే వారికి అవకాశం ఇచ్చారు. మిగిలిన వారిని యధాతధంగా కొనసాగించారు. కానీ వైసీపీ హయాంలో మొత్తం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేశారు.
పూర్తిగా మంత్రులందరినీ తొలగించి ఒకరిద్దరు మంత్రులను కొనసాగిస్తూ మిగిలిన వారందరినీ కొత్తవారిని తీసుకున్నారు. అదే పద్ధతి ఇప్పుడు కూడా కొనసాగుతుందనేది కూటమిలో జరుగుతున్న ఒక చర్చ. కానీ దీనికి అవకాశం లేదన్నది పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తే మళ్లీ ఆయా శాఖలపై పట్టు సాధించడం, జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించ లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి అన్నది చంద్రబాబు ఆలోచన. అయితే ఇప్పటికే ఒక సీటు ఖాళీ ఉంది. దీంతోపాటు మరో రెండు మూడు సీట్లు తీసేసి కొత్తవారికి అవకాశం ఇచ్చే పరిస్థితి మాత్రమే ఉంటుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందని చూడాలి.