కారు.. కమలం ఎంపీలు ఒకే విమానంలో వచ్చినప్పుడు ఏమైంది?

Update: 2021-02-14 12:30 GMT
ఆమె అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఆయన.. తెలంగాణ బీజేపీ ఎంపీగానే కాదు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఇద్దరు ప్రముఖులు ఒకే విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆసక్తికర సంభాషణ సహజం. తాజాగా ఆ విషయాల్ని వెల్లడించిన టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత ఆసక్తికరంగానే కాదు.. ఎంపీ బండి సంజయ్ ను చిక్కుల్లో పడేలా ఉన్నాయి. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..

మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. ఎంపీ బండి సంజయ్ లు ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా వారి మధ్య మాటలు నడిచాయి. ఆ సందర్భంలో తెలంగాణకు గిరిజన వర్సిటీ.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రానికి చెప్పి మంజూరు చేయించాలని తాను కోరినట్లు కవిత వెల్లడించారు.

అయితే.. అందుకు స్పందించిన బండి సంజయ్.. ఆ పనులు చేయిస్తే పేరు సీఎం కేసీఆర్ ఖాతాలో పడుతుందని.. అందుకే తాను కేంద్రంతో మాట్లాడే చొరవ తీసుకోనని సంజయ్ తనతో చెప్పినట్లుగా కవిత ఆరోపించారు. అంతేకాదు.. బీజేపీవాళ్లు కానీ వచ్చి ఓట్లు అడిగతే.. ముడ్డి పగలగొట్టాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి.. తాము ఒకే ఫ్లైట్ లో ప్రయాణించిన అంశంపై మాలోతు కవిత చేసిన ఆరోపణలకు బండి సంజయ్ ఏమని బదులిస్తారో చూడాలి.
Tags:    

Similar News