అన్నీ బెజవాడ ‘‘కామ’’లు కావు భయ్

Update: 2015-12-16 07:58 GMT
కొన్ని అంశాలు అనూహ్యంగా ప్రాచుర్యం పొందుతుంటాయి. తాజాగా కాల్ మనీగా చెబుతున్న ‘కామ’ వ్యవహారమే దీనికి నిదర్శనం. కాల్ మనీని సింపుల్ గా చెప్పాలంటే.. రూ.10 నుంచి రూ.15 వడ్డీ వసూలు చేయటం. ఇది రోజుల వారీగా మొదలు.. వారాలు.. నెలల చొప్పున ఉంటుంది. ఇలాంటి దందా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ. ఇదేమీ విజయవాడకు మాత్రమే సొంతం కాదు. కాకపోతే.. మిగిలిన ప్రాంతాలకు.. బెజవాడలో కామకు మధ్య వ్యత్యాసం ఏమిటంటే.. అప్పు తీసుకొని చెల్లించని వారి ఇంటి మహిళల్ని బలవంతంగా వ్యభిచారంలోకి దించటమే ఒక్కటే.

ఈ ఆరాచకం తప్పించి.. దాడులు చేయించటం.. ఆస్తులు లాగేసుకోవటం.. ఖాళీ ప్రామసరీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకోవటం ఇవన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిచోటా కనిపిస్తారు. కాల్ మనీ వ్యవహారం ఇప్పుడే మొదలు కాలేదు. 1990 నుంచి ఉంది. అప్పట్లో అయితే.. ఐదు వేల రూపాయిలు అప్పు కోరుకునే వారికి.. రూ.500 మినహాయించి రూ.4500 ఇచ్చే వారు. రోజూ రూ.50 చొప్పున వందరోజులు ఇవ్వాలి. ఆదివారాలు మొదలు కొని.. సెలవు రోజుల్లో కూడా ఇవ్వాల్సిందే.

ఉదాహరణకు ఆదివారం ఇవ్వాల్సిన రూ.50 ఇవ్వలేకపోతే.. సోమవారం రూ.100 ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఇలాంటి అప్పులన్నీ చిరు వ్యాపారాలు.. ఓ మోస్తరు వ్యాపారాలు చేసే వారు తీసుకుంటారు. అయితే..ఇది వెయ్యి మొదలుకొని లక్షల్లో కూడా అప్పులు ఇచ్చే వారు ఉంటారు. ఇక.. అదే సమయంలో కొన్ని వ్యాపారాలు ఉంటాయి. రోజుల వ్యవధికి భారీగా డబ్బులు కావాల్సి వస్తుంది. వారికేమో.. రోజుల లెక్కల్లో డబ్బులు ఇచ్చే వారు ఉండరు. ఇలాంటి వారు కూడా వడ్డీ విషయంలో కాస్త అటూఇటూగా ఉండి.. కామ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుంటారు.

ఈ వ్యాపారం చేసే వారు ఖాళీ ప్రామసరీ కాగితాల మీద సంతకాలు చేయించుకుంటారు. ఒకవేళ.. అమౌంట్ భారీగా ఉంటే.. ఆస్తుల్ని తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఇచ్చే అప్పు రూ.2 లక్షలు అయినా.. తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించుకునేది మాత్రం రూ.10లక్షల ఆస్తి విలువ ఉన్న వాటికే. ఇలా సాగే కాల్ మనీ వ్యవహారంలో.. అప్పు తిరిగి చెల్లించని వారి ఇంటి మహిళల్ని వ్యభిచారంలోకి దింపటం.. వారిని శారీరక హింసలకు గురి చేయటం లాంటి దారుణాలు ఉండేవి కావు.

తాజాగా బెజవాడలో వెలుగులోకి వచ్చిన ఈ కామ వ్యవహారంలో పోలీసులు కఠినంగా వ్యవహరించటంతో.. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు చెందిన కామ వ్యాపారులకు శాపంగా మారింది. వారు.. విజయవాడలో మాదిరి వ్యవహరించకున్నా.. ఈ పేరుతో అప్పులు తీసుకునే వారు పోలీసుల్నిఆశ్రయిస్తున్నారు. దీంతో.. వడ్డీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిజానికి ఇది కూడా మంచిది. ఎందుకంటే.. కామ వ్యాపారుల వడ్డీ.. కనిష్ఠంగా రూ.7 నుంచి గరిష్ఠంగా రూ.20 వరకూ ఉంటుంది మరి.

కాకపోతే.. బెజవాడ మినహా.. మిగిలిన జిల్లాల్లో వెలుగు చూస్తున్న కామ బాధితులకు.. బెజవాడ బాధితులకు మధ్య వ్యత్యాసం ఉందన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. బెజవాడ పేరుతో కామ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటంతో.. పలువురు బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. తాము వడ్డీకి తీసుకున్న కామ వ్యాపారులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. అయితే.. బెజవాడ కామకు మిగిలిన కామకు మధ్య అంతరాన్ని పోలీసులు పసిగట్టి చర్యలు తీసుకోవటం.. ఇలాంటి సందర్భంలో అక్రమ వడ్డీదారుల పీచమణచటానికి చంద్రబాబుకు చక్కటి అవకాశం లభించిందని చెప్పొచ్చు. మరి.. బెజవాడ కామ.. మిగిలిన జిల్లాల కామ విషయాల్లో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
Tags:    

Similar News