కేసీఆర్‌.. ఉత్త‌మ్ హామీల‌కు ఎంత కావాలో తెలుసా?

Update: 2018-10-18 04:53 GMT
ఒక‌రికి మించి మ‌రొక‌రు పోటాపోటీగా ఎన్నిక‌ల హామీల పేరిట తాయిలాల్ని ఓ రేంజ్లో ప్ర‌క‌టిస్తున్నారు. మొన్న‌టివ‌ర‌కూ ఉత్త‌మ్ అనుకుంటే.. మా ముందు ఆయ‌నెంత అన్న‌ట్లుగా అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీన్లోకి వ‌చ్చేశారు. అభ్య‌ర్థుల్ని ముందుస్తుగా ప్ర‌క‌టిస్తే చాలు.. తాను చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌తో ఎన్నిక‌ల్లో విజ‌యం ప‌క్కా అని.. వంద లేదంటే నూట‌ప‌ది సీట్లు ఖాయ‌మ‌న్న ధీమాతో ఉన్న కేసీఆర్ కు.. కాంగ్రెస్ ఇస్తున్న హామీల ప్ర‌భావం అంత‌కంత‌కూ తెలిసి రావ‌టంతో.. తెలివి తెచ్చుకున్న కేసీఆర్ వెంట‌నే ప్లాన్ బీని తెర మీద‌కు తెచ్చేశారు.

ప్ర‌తిపక్షం ఇచ్చే హామీల‌కు మించిన తాయిలాల్ని ప్ర‌క‌టించేశారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోను ముందు రిలీజ్ చేయ‌లేక‌.. అలా అని ఏమీ మాట్లాడ‌కుండా ఉంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌తో ఆయ‌న ఎన్నిక‌ల హామీల‌కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. గ‌తంలో ఉత్త‌మ్ హామీల్ని అమ‌లు చేయాలంటే ద‌క్షిణాది రాష్ట్రాల బ‌డ్జెట్లు మొత్తం క‌లిపితే కానీ సాధ్యం కాద‌ని ఎట‌కారం ఆడిన కేటీఆర్ సైతం మారు మాట్లాడ‌లేని రీతిలో ఆయ‌న తండ్రి క‌మ్ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించిన హామీలు ఉన్నాయి.

ఇక‌పై.. ఉత్త‌మ్ లాంటోళ్ల మీద కేటీఆర్ ఎట‌కారం ఆడ‌లేని ప‌రిస్థితి. ఉత్త‌మ్‌కు మించిన హామీల్ని ఇచ్చిన కేసీఆర్ తీరు చూశాక‌.. రానున్న రోజుల్లో ఈ హామీల ప‌ర్వం మ‌రింత ముదిరిపోవ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. కేసీఆర్‌.. ఉత్త‌మ్ లు ఇద్ద‌రూ పోటాపోటీగా ఇస్తున్న హామీల్ని అమ‌లు చేయాలంటే ఎంత డ‌బ్బులు కావాల‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఈ లెక్క‌ను వేస్తున్న వారికి నోట మాట రాని ప‌రిస్థితి.

ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు ప్ర‌క‌టించిన హామీల్లో రుణ‌మాఫీని ప‌క్క‌న పెట్టేసి.. మిగిలిన ప‌థ‌కాల అమ‌లుకు అవ‌స‌ర‌మైన మొత్తం ఏటా రూ.1.50ల‌క్ష‌ల కోట్లుగా చెబుతున్నారు. అంటే.. ఐదేళ్ల ప్ర‌భుత్వంలో ఈ సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌టానికి అవ‌స‌ర‌మైన మొత్తం రూ.7.5ల‌క్ష‌ల కోట్లు. మ‌రి.. ఇంత భారీ ఖ‌ర్చు నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయం ఎంత‌? అన్న‌ది చూస్తే.. షాక్ తినాల్సిందే.

కేంద్రం నుంచి వ‌చ్చే ఆదాయం కావొచ్చు.. వివిధ మార్గాల్లో రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయాన్ని చూస్తే.. ఏటా కేవ‌లం రూ.90వేల కోట్ల‌కు మించి ఆదాయం రాని ప‌రిస్థితి. అంటే.. హామీల అమ‌లుకు.. మిగిలిన ముఖ్య‌మైన వాటికి రూ.1.50ల‌క్ష‌ల కోట్లు అవ‌స‌ర‌మైన నేప‌థ్యంలో.. మిగిలిన కార్య‌క‌లాపాల మాటేమిటి? అందుకు అయ్యే ఖ‌ర్చు సంగ‌తి ఏమిటి? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పే వారు క‌నిపించ‌టం లేదు.

రైతులు.. నిరుద్యోగులు.. ఫించ‌న్ల ప‌థ‌కాల‌కే ఏటా రూ.50వేల కోట్లు కావాల్సి ఉంటుంది. కేసీఆర్ స‌ర్కారు అమ‌లు చేస్తున్న కల్యాణ ల‌క్ష్మీ.. కేసీఆర్ కిట్లు.. రైతుబంధు.. రైతు బీమా.. అస‌రా ఫించ‌న్లు.. బీడీకార్మికుల భృతి లాంటి ప‌థ‌కాల‌కు కేసీఆర్ స‌ర్కారు చేసిన ఖ‌ర్చు 1.04ల‌క్ష‌ల కోట్లు. ఇక‌.. జీత‌భ‌త్యాల‌కు రూ.30వేల కోట్లు అవ‌స‌రం అవుతుంది. ఇక‌.. సాగునీటి ప్రాజెక్టులు.. మౌలిక‌స‌దుపాయాలు.. వ‌స‌తులు ఇలా చెప్పుకుంటూ పోతే.. వాటిక‌య్యే ఖ‌ర్చు త‌డిచి మోపెడు. మ‌రి.. ఖ‌ర్చు భారీగా.. ఆదాయం అంతంత‌గా ఉన్న నేప‌థ్యంలో.. నిధులు స‌మ‌కూర్చుకోవ‌టానికి మిగిలిన ఏకైక మార్గం ఎడాపెడా అప్పులు చేయ‌ట‌మే.
4

గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో తెలంగాణ స‌ర్కారు దాదాపు రూ.2.5ల‌క్ష‌ల కోట్లు వ‌ర‌కూ చేసింద‌ని చెబుతారు.ఈ అప్పుల వ‌డ్డీల‌తో పాటు.. అస‌లు తీర్చ‌టం ఒక స‌మ‌స్య అయితే.. కొత్త‌గా చేయాల్సిన అప్పులు.. వాటి లెక్క‌ల్ని కాగితం మీద వేయ‌టం మొద‌లుపెడితే.. చెమ‌ట‌లు ప‌ట్ట‌టం ఖాయం. మొత్తంగా చూస్తే.. ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించ‌టానికి నేత‌లు ఇస్తున్న హామీలు.. చివ‌రికి ప్ర‌జ‌ల నెత్తిన మోయ‌లేని భారాన్ని మిగ‌ల్చ‌ట‌మే కాదు.. ఏదో రోజు పుట్టె మునిగిపోవ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. తాయిలాల పేరుతో నేత‌ల ఆడే ఆట‌లు ప్ర‌జ‌ల పాలిట గుదిబండ‌లే.
Tags:    

Similar News