ముంబయిలో బీజేపీ నేతగా ఎదిగిన బంగ్లాదేశీ

Update: 2021-02-22 04:40 GMT
దొంగ దొరక్కూడదంటే.. ఏకంగా పోలీసు ఇంట్లోనే తిష్ట వేస్తే.. ఇలాంటి సిత్రమైన ప్లాన్లు టాలీవుడ్.. బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తుంటాయి. రీల్ లైఫ్ కు మించిన రియల్ లైఫ్ లో బీజేపీ నేత ఒకరు వేసిన ప్లానింగ్ కు కమలనాథులకు దిమ్మ తిరిగే షాక్ తగలటంతో పాటు.. జరిగిన దాన్ని కవర్ చేసుకునేందుకు వారు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఇంతకూ జరిగిందేమంటే.. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ఒక వ్యక్తి ముంబయి చేరుకున్నాడు.

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దేశ ఆర్థిక రాజధానిలో తలదాచుకున్నాడు. తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదంటే.. తాను కూడా బీజేపీని సమర్థిస్తే.. ఇక తనపై వారి ఫోకస్ పడదని భావించారో ఏమో కానీ.. ఏకంగా బీజేపీలో చేరిపోయాడు. కట్ చేస్తే..బీజేపీ లోకల్ నాయకుడి స్థాయికి ఎదిగాడు. అయితే.. ఇతగాడి మీద వచ్చిన అనుమానంతో విచారించిన పోలీసులు అసలు విషయాన్ని బట్టబయలు చేశారు.

దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులతో పాటు.. ఇతర దేశాల వారిని వారి దేశాలకు పంపేయాలంటూ బీజేపీ నతేలు తరచూ హడావుడి చేస్తుంటారు. అలాంటి పార్టీలోకి బంగ్లాదేశీ వచ్చి నేతగా స్థిరపడటాన్ని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు.. ముంబయికిచెందిన బీజేపీ నేత  కమ్ ఎంపీ గోపాల్ శెట్టికి అనుచరుడిగా మారిన అతడిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఉత్తర ముంబయి మైనార్టీ సెల్ చీఫ్ గా వ్యవహరించినట్లుగా సోషల్ మీడియాలో అతని వివరాలు వైరల్ అవుతున్నాయి. దీనికి ఏం చెప్పి ఇందులో నుంచి తప్పించుకోవాలో అర్థం కాక కమలనాథులు కిందామీదా పడుతున్నారు.
Tags:    

Similar News