వారాహి యాత్రలో బీజేపీ పాత్రేమిటో ?

Update: 2023-06-03 11:00 GMT
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  వారాహి ప్రచార రథం రోడ్డెక్కబోతోంది. జూన్ 14వ తేదీన అన్నవరంలోని సత్యదేవుడి సన్నిధిలో పూజలు చేసి యాత్రను పవన్ మొదలుపెట్టబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో యాత్ర రూటును ఫిక్స్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో రెండురోజులు కేటాయించారు. యాత్రతో పాటు ఫీల్డ్ పర్యవేక్షణ కూడా చేయబోతున్నారు. ఒకవిధంగా వారాహి యాత్రను ఎన్నికల ప్రచారంగానే అనుకోవాలి.

అంతాబాగానే ఉంది కానీ ఈ యాత్రలో మిత్రపక్షం బీజేపీ పాత్ర ఏమిటి ? అనే చర్చ మొదలైంది. బీజేపీ, జనసేన మిత్రపక్షాలన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏరోజు మిత్రపక్షాలుగా ఉమ్మడి కార్యక్రమాలు చేసిందిలేదు. ఎంతసేపూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్, బీజేపీ చీఫ్ సోమువీర్రాజు విడివిడిగా మీడియా సమావేశాలు పెడుతు, సభలు నిర్వహిస్తున్నారే కానీ ఉమ్మడిగా చేసిందేమీ లేదు. పైగా ఉమ్మడి కార్యక్రమాలను చేయాలని కూడా ఎవరు అనుకోలేదు.

సరే ఇదంతా చరిత్రగా ముగిసిపోయిందని అనుకుంటే మరి తొందరలో జరగబోయే వారాహి యాత్ర మాటేమిటి ? అనే చర్చ మొదలైంది. వారాహి యాత్రలో పాల్గొనేందుకు బీజేపీ నేతలను కూడా పవన్ ఆహ్వానించబోతున్నారా అనే చర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే సోమువీర్రాజుది కూడా తూర్పుగోదావరి జిల్లాలోని  రాజమండ్రే. ఇపుడు ఎలాగూ మొదటివిడత పర్యటన తూర్పుగోదావరి జిల్లాలోనే మొదలవ్వబోతోంది. కాబట్టి ఇపుడైనా మిత్రధర్మాన్ని పవన్ పాటిస్తారా అనేది ఆసక్తిగా మారింది.

ఒకవైపు టీడీపీతో పొత్తుపెట్టుకునే విషయంలో పవన్ బాగా ఆసక్తిగా ఉన్నారు. ఇదే సమయంలో అవసరమైతే  బీజేపీని వదిలేయటానికి కూడా పవన్ సిద్ధంగా ఉన్నారు. కలిసొస్తే మూడుపార్టీలు లేదా టీడీపీ, జనసేన అన్నట్లుగా ఉంది పవన్ వైఖరి. ఈ కాంబినేషన్లన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే బీజేపీ నేతలను పవన్ తన యాత్రలో కలుపుకుని వెళతారా ? అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇపుడు గనుక తన యాత్రలో బీజేపీ నేతలు కలుపుకుని వెళ్ళకపోతే రాబోయే ఎన్నికల్లో కమలనాదులతో కటీఫ్ చెప్పటానికి పవన్ రెడీగా ఉన్నట్లు అర్ధమైపోతుంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Similar News