తెలుగు ఎంపీల కోసం క‌మ‌లం కొత్త వ్యూహం

Update: 2017-09-29 06:13 GMT
ఈశాన్యాన్ని ఒప్పించి.. ఉత్త‌రాదిని మెప్పించట‌మే కాదు.. కాశ్మీరాన్ని సైతం కొల్ల‌గొట్టిన‌ క‌మ‌ల‌నాథుల‌కు ఒక ప‌ట్టాన కొరుకుడుప‌డ‌నిది ఏమైనా ఉందంటే అది ద‌క్షిణాది రాష్ట్రాలే. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా ద‌క్షిణాది ప్ర‌జ‌లు మాత్రం కాషాయ‌ద‌ళానికి ప‌వ‌ర్ అప్ప‌గించేందుకు సిద్ధంగా లేర‌ని చెప్పాలి. దేశంలోని అన్ని భాగాల్లోనే విజ‌యోత్సాహంతో కాషాయ జెండా ఎగుర‌వేసినా..  సౌత్ లో మాత్రం స్థానం సంపాదించ‌క‌పోవ‌టం బీజేపీకి పెద్ద లోటుగా మారింది.
అందుకే.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నికల్లో వీలైన‌న్ని సీట్లను చేజిక్కించుకోవ‌టానికి వీలుగా పావులు క‌దుపుతోంది

ద‌క్షిణాదిలో 42 లోక్ స‌భ స్థానాలున్న రెండు తెలుగు రాష్ట్రాల మీద క‌మ‌ల‌నాథులు గురి పెట్టారు. వీలైన‌న్ని ఎక్కువ సీట్ల‌ను చేజిక్కించుకోవ‌టానికి వీలుగా పార్టీలో తోపుల్లాంటి నేత‌ల్ని ఎంపిక చేశారు. వీరంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో వీలైన‌న్ని ఎక్కువ సీట్ల‌లో బీజేపీని గెలిపించ‌ట‌మే లక్ష్యంగా ప‌ని చేయ‌నున్నారు.

ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకొని బ‌రిలోకి దిగ‌నున్న బీజేపీ.. తెలంగాణ‌లో మాత్రం అందుకు భిన్నంగా ఒంట‌రిగా పోటీ చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌లువురు కేంద్ర‌మంత్రులు విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ.. ఎంపీ సీట్ల‌ను మ‌రింత‌గా పెంచుకోవ‌టానికి ఏమేం చేయాల‌న్న వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్ని ఆరు క్ల‌స్ట‌ర్లుగా మార్చాల‌ని బీజేపీ అధినాయ‌క‌త్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ఏపీకి ముగ్గురు.. తెలంగాణ‌కు మ‌రో ముగ్గురు ఇన్ ఛార్జిల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావిస్తున్నారు.

పార్టీకి ఇప్ప‌టివ‌ర‌కూ విలువైన సేవ‌ల్ని అందించిన వారిని ఈ ప్రాజెక్టు కోసం వినియోగించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. పార్టీ ఉనికి లేని కాశ్మీర్‌.. ఈశాన్య‌రాష్ట్రాల్లో త‌మ విలువైన సేవ‌ల‌తో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిన నేత‌ల్ని వ్యూహాత్మ‌కంగా ఎంపిక చేసి.. వారికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్కో క్ల‌స్ట‌ర్ల‌లో ఆరుగురు నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు. వీరంతా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ‌కు కేటాయించిన క్ల‌స్ట‌ర్ల‌లోని ఎంపీ స్థానాల్ని బీజేపీ జెండా ఎగిరేలా చేయ‌టం వీరి బాధ్య‌త‌.
 
తెలంగాణ‌లోని కీల‌క మెద‌క్‌.. నిజామాబాద్‌.. అదిలాబాద్‌.. క‌రీంన‌గ‌ర్‌.. జ‌హీరాబాద్ లోక్ స‌భ స్థానాల్ని పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్‌కు అప్ప‌గించారు. చేవెళ్ల‌.. మ‌ల్కాజిగిరి.. వ‌రంగ‌ల్‌.. మ‌హ‌బూబాబాద్ స్థానాల బాధ్య‌త కేంద్ర మంత్రి న‌రేంద్ర‌సింగ్ కు.. బీహార్ రాష్ట్ర ఆరోగ్య‌మంత్రి మంగ‌ళ్ పాండేకు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌.. నాగ‌ర్ క‌ర్నూలు.. భువ‌న‌గిరి.. న‌ల్ల‌గొండ స్థానాల్ని అప్ప‌గించారు. ఇక‌.. మ‌జ్లిస్‌కు కంచుకోట అయిన హైద‌రాబాద్ ఎంపీస్థానం మీద దృష్టి పెట్టేందుకు ప్ర‌త్యేకంగా ఒక సీనియ‌ర్ నేత‌కు బాధ్య‌త అప్ప‌గించ‌నున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే.. ప‌లు రాష్ట్రాల్లో ప‌ని చేసి పార్టీకి విశేష‌మైన సేవ‌లు అందించిన సీనియ‌ర్ నేత ముర‌ళీధ‌ర‌రావుకు ఉత్త‌రాంధ్ర‌తో పాటు.. కాకినాడ లోక్ స‌భ స్థానం బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మ‌హారాష్ట్ర మంత్రి వినోద్ తావ్ డేకు రాయ‌ల‌సీమ‌లోని లోక్ స‌భ స్థానాలు.. కేంద్ర‌మంత్రి ఆర్కే సింగ్‌ కు కోస్తాలోని లోక్ స్థానాలకు ఇన్ చార్జులుగా నియ‌మించ‌నున్నారు. వీరంతా త‌మ‌కు కేటాయించిన క్ల‌స్ట‌ర్ల‌పై దృష్టి సారించి పార్టీ ఖాతాలోకి మ‌రిన్ని ఎంపీ స్థానాలు ప‌డేలా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. మ‌రి.. ఈ వ్య‌వ‌హారంలో ఎంత‌మంది స‌క్సెస్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News