అసద్ ఇలాకాలో సాక్షి మహారాజ్ హల్ చల్

Update: 2016-04-15 09:43 GMT
సంచలన వ్యాఖ్యల బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ హైదరాబాద్ లో దిగారు..  తన అలవాటు ప్రకారం ఇక్కడా నోటికి పనిచెప్పారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పోలీసు తూటాలే కరెక్టని ఆయన అన్నారు.  భారత్ మాతాకి జై అని అనని నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.  హైదరాబాద్‌ లోని ధూల్‌ పేట- సీతారాంబాగ్‌ శ్రీరామ శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదం నిర్మూలనకు మోడీ సర్కార్‌ కృతనిశ్చయంతో ఉందన్నారు.

కాగా భారత్ మాతాకీ జై అని అనడానికి నిరాకరించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని టార్గెట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. హిందూత్వాన్ని గట్టిగా నమ్మే సాక్షి మహారాజ్ మొదటి నుంచి తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి అలవాటు పడ్డారు. గతంలోనూ ఆయన చేసిన ఎన్నో వ్యాఖ్యలు పెను దుమారాలు రేపాయి.  ముఖ్యంగా అసదుద్దీన్ ఒవైసీ విషయంలో సాక్షి మహారాజ్ గతంలోనూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. యాకూబ్ మెమన్ ముస్లిం కావడం వల్లే ఉరితీశారని అసద్ గతంలో పేర్కొనగా అప్పట్లో సాక్షి మహారాజ్ దానిపై తీవ్రంగా మండిపడ్డారు. భారతీయ చట్టాలను, కోర్టుల నిర్ణయాలను గౌరవించనివారు పాకిస్థాన్ వెళ్లిపోవచ్చని అన్నారు. అలాగే ఇంకో సందర్భంలో హైదరాబాద్ ను ఉగ్రవాద కేంద్రంగా అభివర్ణించారాయణ. ఇవన్నీ ఎంఐఎంను టార్గెట్ చేసి చేసిన కామెంట్లే. ఇంకో సందర్భంలో ఆయన ప్రతి హిందువూ కనీసం నలుగురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు... అప్పుడే హిందూ మతాన్ని కాపాడుకోగలమని చెప్పారు.
Tags:    

Similar News